హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఎవరనేది తేలిపోయింది. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికైనట్లు మంగళవారం తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న వెల్లడించారు. పార్టీలో అంతర్గత చీలిక నిజమేనని ఆయన స్పష్టతనిచ్చారు. చీలిన వర్గాలది ఎవరి సిద్దాంతం వారిదేనని కూడా ఆయన పేర్కొన్నారు. మావోయిస్ట్ సిద్ధాంతం ఓడిపోలేదన్నారు. ప్రస్తుత పరిస్థితులు, అనారోగ్యంవల్లే తాము జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు. తాము ఇప్పటికీ దేవ్ జీకే మద్ధతునిస్తామని, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనును విభేదిస్తున్నట్లు పుల్లూరి ప్రసాదరావు ప్రకటించడం విశేషం. చంద్రన్నతోపాటు బండి ప్రకాష్ కూడా డీజీపీ ముందు లొంగిపోయారు.

