Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

‘సర్దు’కుంటున్న ప్రముఖులు!

కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో పలువురు ప్రముఖులు సర్దుకుంటున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులే కాదు, సినీ ప్రముఖులు, ఇన్ ఫ్లూయెన్సర్లు సైతం ఈ విషయంలో అప్రమత్తం అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులు, ముఖ్యంగా జింకలు, నెమళ్లు పారిపోతునట్లు ఏఐ టెక్నాలజీతో రూపొందించిన చిత్రాలను, దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. తప్పుడు పోస్టులపై తెలంగాణా ప్రభుత్వం సీరియస్ కావడమే ఇందుకు ప్రధాన కారణం.

కంచ గచ్చబౌలి భూముల్లో బుల్డోజర్లు చదును చేస్తుండగా వన్యప్రాణులు పారిపోతున్నట్లు, ఓ జింక గాయపడినట్లు ఉన్న పోస్టులు కల్పితమని సైబర్ క్రైం పోలీసులు తేల్చేశారు. ఈ విషయంలో పలు పోస్టులు కూడా ఫేక్ గా సైబర్ క్రైం పోలీసులు తమ విచారణలో తేల్చారు. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే తప్పుడు పోస్టులు చేసిన వారిపై పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు.

బీఆర్ఎస్ నాయకులు కొణతం దిలీప్, మన్నె క్రిశాంక్ లకే గాక మరికొందరిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఈనెల 9, 10, 11 తేదీలలో తమ ముందు విచారణకు రావాలంటూ మన్నె క్రిశాంక్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై మన్నె క్రిశాంక్ తనదైన శైలిలో స్పందించారనేది వేరే విషయం. మరోవైపు తప్పుడు పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం తరపున సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

పోలీసు కేసులు, కోర్టులలో విచారణ పరిణామాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వివాదాస్పద పోస్టులను తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఇంకొందరు సినీ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు కూడా ఇటువంటి పోస్టులను డిలీట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ అంశంలో ఫేక్ పోస్టులు తెలంగాణా ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా బద్నాం చేసిన అనంతరం తాము పెట్టిన పోస్టులను ‘ప్రముఖులు’ తొలగిస్తుండడం గమనార్హం.

Popular Articles