Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘బెట్టింగ్ యాప్స్’లో బిగ్ స్టార్స్

మొన్న దొరికింది చిన్న చేపలు! ఇవాళ తిమింగలాలు దొరికాయి! అభిమానులను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చిన రీతిలో సోషల్ మీడియాలో చెలరేగిపోయి బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన బిగ్ స్టార్స్ బుక్ అయ్యారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి!

దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లాంటి టాప్ స్టార్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో పాల్గొని ఓ మోస్తరుగా సంపాదించారు. వాళ్ళ ప్రచారాన్ని చూసి ప్రభావితులై బెట్టింగ్స్ లో పాల్గొని డబ్బులు పోగొట్టుకుని అప్పుల్లో కురుకుపోయి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు, జీవితాలను శాశ్వతంగా ముగించుకున్న వాళ్ళు ఎందరో.. మరెందరో! ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ పట్టుదలగా ఈ బెట్టింగ్స్ యాప్ లను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగెళ్ళ, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్యరాజన్, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, వైసీపీ శ్యామల, టేస్టి తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రిత… మొత్తం 25 మంది సినిమా, బుల్లితెర, సోషల్ మీడియా స్టార్లపై కేసులు నమోదు చేశారు.

కాగా, గురువారం విష్ణుప్రియ, రీతూ చౌదరి పంజగుట్ట స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. భారీ మొత్తంలో తమకు డబ్బు లభించిందని, మూడు యాప్స్ కు మాత్రమే ప్రచారం చేసినట్లు అంగీకరించారు! పోలీసులు వారి ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. విష్ణుప్రియ మొత్తం 15 యాప్స్ ప్రచారం చేసినట్లు తెలుస్తోంది! విజయ్ దేవరకొండ కేవలం స్కిల్డ్ బేస్డ్ గేమ్ కు మాత్రమే ప్రచారం చేశారని, ఆ కాంట్రాక్టు గత ఏడాది ముగిసిందని ఆయన పిఆర్ టీమ్ మీడియాకు నోట్ పంపించారు. మొత్తానికి సెలబ్రిటీలు అని కూడా చూడకుండా వెనక ముందు ఊగిసలాడకుండా ధైర్యంగా చట్టపరంగా కేసులు నమోదు చేసిన మియాపూర్ పోలీసులకు, ఉన్నత పోలీస్ అధికారులకు అభినందనలు.

నిజానికి సెలబ్రిటీలపై కేసు నమోదు చేయడమే ముందడుగు! బన్నీ అర్జున్ నే వదల్లేదు! వీళ్లెంత? ఇప్పుడు నడుస్తున్నది రేవంత్ రెడ్డి ప్రజా పాలన! సీవీ ఆనంద్, సజ్జనార్ లాంటి సిన్సియర్ ఆఫీసర్లు! అయితే డ్రగ్స్ కేసుల్లో మాదిరిగా స్టార్స్ ను విచారణకు పిలిచి షో చేయకుండా, ఈసారైనా అరెస్టుల పర్వం కొనసాగితే బావుంటుంది! అదే జరిగితే ఇంకోసారి ఎవ్వరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జోలికి వెళ్ళరు!

Popular Articles