Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు

వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు నాన్ బెయిలబుల్ సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కూడా ప్రెస్ క్లబ్ ముఖ్యులపై కేసు నమోదు కావడం గమనార్హం. హన్మకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ భవనపు పాత ప్రహారీ గోడ కూల్చివేత సందర్భంగా అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తెలంగాణా యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ఆర్. లెనిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత డిసెంబర్ లోనే ప్రెస్ క్లబ్ కమిటీ పదవీ కాలం ముగిసినప్పటికీ, పద్ధెనిమిది నెలలుగా అభివృద్ధి పనులు చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఈనెల 7వ తేదీన పాత ప్రహారీ గోడ కూల్చివేతోపాటు అక్కడే గల అంబేడ్కర్ విగ్రహాన్ని తాళ్లు కట్టి, మెడకు ఉచ్చులా బిగించి విగ్రహాన్ని ధ్వంసం చేశారని లెనిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులతోపాటు మరో ఇద్దరు కారకులని లెనిన్ ఆరోపించారు.

తమకు అందిన ఫిర్యాదు మేరకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్యలపై మూడు రెండు నాన్ బెయిలబుట్ సెక్షన్లతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 324(4), 298, 299 రెడ్ విత్ 3(5), 3PDPPA, 3(1)(T), 3(1)(V), SC ST POA Act 2015 ప్రకారం కేసు నమోదు చేశారు. వీటిలో 324(4), 298 నాన్ బెయిలబుల్ సెక్షన్లు కాగా, ఈ రెండు సెక్షన్లకు అనుబంధంగా 3 పీడీపీపీఏ సెక్షన్ కూడా ఉండడం గమనార్హమని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.

కాగా ప్రెస్ క్లబ్ లోకి అనుమతి లేకుండా ప్రవేశించి, న్యూసెన్స్ చేశారంటూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపైనా మరో ఐదుగురిపై సుబేదారి పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని 329(3), 292, 126(2), 351(2) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురిలో ప్రెస్ క్లబ్ బాధ్యులపై ఫిర్యాదు చేసిన బీఆర్ లెనిన్ కూడా ఉన్నట్లు నాగరాజు తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. మొత్తంగా వరంగల్ ప్రెస్ క్లబ్ కు సంబంధించి జర్నలిస్టుల పరస్పర ఫిర్యాదులు, కేసులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Popular Articles