Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

భద్రాద్రి జిల్లా ఎస్పీ పీఆర్వో రౌడీయిజం, కేసు నమోదు

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పోలీస్ పీఆర్వో, కానిస్టేబుల్ డి. శ్రీనివాస్ పై పాల్వంచ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాల్వంచ పట్టణంలోని ఓ రెస్టారెంట్ వద్ద కారు పార్కింగ్ వివాదంలో చోటు చేసుకున్న వివాదంలో ఎస్పీ పీఆర్వో శ్రీనివాస్ రౌడీయిజం చేసినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. బాధితుని షాపులోకి చొరబడి ఆస్తికి నష్టం కలిగించడం, అసభ్యకర పదజాలంతో దూషించడం, దుర్భాషలాడడం, చేయి చేసుకోవడం, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని బెదిరించిన పలు అభియోగాలపై పోలీస్ పీఆర్వో శ్రీనివాస్ పై కేసు నమైదైంది. పూర్తి వివరాల్లోకి వెడితే..

బాధితుడు ఇషాంత్ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. తన షాపు పక్కనే గల రెస్టారెంట్ కు వచ్చే భోజనప్రియులు తమ వాహనాలను తన దుకాణం ముందు పార్క్ చేస్తుండడంతో తన వ్యాపారం దెబ్బ తింటోందని, కార్లను తొలగించాలని ఇషాంత్ చౌదరి హోటల్ నిర్వాహకులను కోరారు. దీంతో హోటల్ నిర్వాహకులు ఇషాంత్ చౌదరిపై పగ పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ పీఆర్వో శ్రీనివాస్ ఇషాంత్ చౌదరి దుకాణంలోకి చొరబడి అసభ్య పదజాలతో దుర్భాషలాడుతూ, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని బెదిరించాడు. అంతేకాదు స్క్రూ బాక్స్ తో ఇషాంత్ చౌదరిపై దాడి కూడా చేశాడు. రెస్టారెంట్ లో పనిచేసే మరో ముగ్గురితో కలిసి శ్రీనివాస్ రూ. 10 వేల విలువైన ఆస్తి విధ్వంసానికి కూడా పాల్పడ్డాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీస్ పీఆర్వో శ్రీనివాస్ పై బీఎన్ఎస్ చట్టంలోని 329(4), 324(4), 296, 115(2), 351(2), r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే కారు పార్కింగ్ అంశంలో పోలీస్ పీఆర్వో ఇంతలా రెచ్చిపోవడానికి కారణం.. రెస్టారెంట్ ను తనే లీజకు తీసుకుని నడుపుతున్నట్లు తెలుస్తోంది. పోలీసు హక్కుల పరిమితి నిబంధన ప్రకారం ఈ శాఖకు చెందిన ఉద్యోగులెవరూ వ్యాపారం నిర్వహించకూడదు. పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యులు సైతం వ్యాపారం నిర్వహించాలన్నా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. కానీ పాల్వంచలో రెస్టారెంట్ ను నడుపుతున్నట్లు ప్రచారంలో గల పీఆర్వో శ్రీనివాస్ పోలీసు హక్కుల పరిమితి నియమావళికి లోబడే వ్యాపారం నిర్వహిస్తున్నారా? లేదా? అనే అంశం తేలాల్సి ఉంది. సాక్షాత్తూ జిల్లా ఎస్పీ పీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఓ సాధారణ కానిస్టేబుల్ పాల్వంచ పట్టణంలో దౌర్జన్యానికి దిగినట్లు కేసు నమోదైన ఘటన పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా పీఆర్వో శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై ఇషాంత్ చౌదరిపైనా బీఎన్ఎస్ చట్టంలోని 296, 329(4), 351(2), r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

హోటల్ మాదే: అంగీకరించిన పీఆర్వో శ్రీనివాస్:
కాగా ఈ ఘర్షణ వివాదానికి సంబంధించిన హోటల్ తమ కుటుంబానికి చెందినదిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ పీఆర్వో శ్రీనివాస్ అంగీకరించాడు. ఆ హోటల్ ను తన భార్య నడుపుతున్నట్లు ఇషాంత్ చౌదరిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఇషాంత్ చౌదరి, అతని సోదరుడు శంకర్ తో కలిసి తన భార్య నడుపుతున్న రెస్టారెంట్ లోకి చొరబడి దుర్భాషలాడుతూ, బెదిరిస్తూ తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడని శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించాడు. ఈ ఘటనకు సంబంధించి ‘సమీక్ష’ వార్తా కథనాన్ని ప్రచురించిన దాదాపు పది నిమిషాల అనంతరం ఇషాంత్ చౌదరిపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని సోషల్ మీడియా వేదికగా పోలీస్ పీఆర్వో శ్రీనివాస్ షేర్ చేయడం గమనార్హం.

Popular Articles