ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఖమ్మం నగర పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. తప్పుడు డాక్యుమెంట్లు, డబుల్ రిజిస్ట్రేషన్లతో మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాపై కేసు నమోదు చేసినట్లు ఖానాపురం హవేలీ సీఐ భానుప్రకాశ్ ఓ ప్రకటనలో తెలిపారు. భూములు లేకపోయినా తప్పుడు రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి ఈ ముఠా మోసం చేస్తోందని చెప్పారు.
ఇటీవల ఖమ్మం నగరంలో భూముల క్రయ, విక్రయాలు తగ్గడంతో అక్రమార్జనకు అలవాటు పడిన మాయగాళ్లు ఖరీదైన భూములకు డాక్యుమెంట్లు సృష్టిస్తూ, తప్పుడు రిజిస్టర్ డాక్యుమెంట్లకు రుణాలు ఇప్పిస్తున్నారని చెప్పారు. ఇటువంటి దందాతో సంబంధం గల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మధురా నగర్ ప్రాంతానికి చెందిన షేక్ బడే సాహెబ్, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన కొత్తపల్లి వేంకటేశ్వర్లు, తిప్పర్తి అశోక్ కుమార్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ఈ ముఠా నుంచి మోసాలకు సంబంధించిన అనేక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కొత్త రకం దందా వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతుందని సీఐ భాను ప్రకాష్ పేర్కొన్నారు.