గులాబీ పార్టీ గొంతుక T న్యూస్ ఖమ్మం జిల్లా రిపోర్టర్ సాంబపై పోలీసులు నమోదు చేసిన కేసు జర్నలిస్టులకు చెబుతున్న సరికొత్త పాఠమేంటి? ఫీల్డు రిపోర్టింగులో ప్రొఫెషనల్ జర్నలిస్టులు నేర్చుకోవలసిన గుణపాఠమేంటి? ఇవీ పాత్రికేయ వర్గాల్లో తాజాగా తలెత్తుతున్న ప్రశ్నలు. నిజానికి వృత్తిపరంగా, నిష్పక్షపాతంగా, నిఖార్సయిన విధులు నిర్వహించే జర్నలిస్టులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే.. పోరాడాల్సిందే.. న్యాయం జరిగే వరకు ఉద్యమించాల్సిందే.. అందుకోసం ఎంతదూరమైనా సరే వెళ్లాల్సిందే.. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇందుకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న అంశాల్లో, వార్తా సేకరణ పేరుతో వసూళ్లకు తెగబడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందిన ఘటనల్లో కేసులు నమోదైన కొందరు విలేకరుల పరిస్థితులే సమాజంలో తీవ్ర చర్చకు దారి తీస్తుంటాయి.
సరిగ్గా వారం రోజుల క్రితం.. ఈనెల 11వ తేదీన ఖమ్మం జిల్లా కొణిజర్లలోని గోపవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద జరిగినట్లు పేర్కొంటున్న ఓ ఘటనలో T న్యూస్ రిపోర్టర్ సాంబపై కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ సాంబపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేశారు? ఇందుకు సంబంధించి కొణిజర్లకు చెందిన దళిత రైతు గంధం నాగరాజు ఇచ్చిన ఫిర్యాదులోని సారాంశాన్ని నిశితంగా పరిశీలిస్తే..

‘‘తాను వ్యవసాయం చేస్తుంటానని, ఈనెల 11వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో యూరియా బస్తాలకోసం కొణిజర్లలోని పీఏసీఎస్ కేంద్రానికి వచ్చి క్యూలో నిలబడి ఉండగా, టీ న్యూస్ ఛానల్ కు చెందిన రిపోర్టర్ సాంబ, అతని వీడియోగ్రాఫర్, మరో అసిస్టెంట్ ముగ్గురూ కలిసి అక్కడ ఉన్న రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు సరఫరా చేస్తున్న యూరియా అందరికీ సరిపడా ఉన్నా కూడా సక్రమంగా చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీకి చెందినవారికి మాత్రమే ఇస్తున్నదని, బీఆర్ఎస్ పార్టీకి చెందినవారికి ఇవ్వడం లేదని, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాకు వాయిస్ ఇవ్వండి అని కోరినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ధర్నాలు చేస్తామని చెప్పాలని, మీ మాటల ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేద్దాం.. అని అక్కడ లైన్ లో ఉన్న రైతులకు చెబుతూ వారిని సాంబ రెచ్చగొట్టాడని నాగరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల యూరియా సరిపడా ఉన్నప్పటికీ, తప్పుడు వార్తలను బలవంతంగా రైతులతో చెప్పించి, దాన్ని టీ న్యూస్ ఛానల్ లో టెలీకాస్ట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఉపయోగించాలని చూసిన టీ న్యూస్ రిపోర్టర్ సాంబపై, ఆ ఛానల్ వీడియో గ్రాఫర్ పై, వాళ్లకు సహకరించిన మరో వ్యక్తి సహా మొత్తం ముగ్గురిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రైతు నాగరాజు కోరారు.

ఈమేరకు కొణిజర్ల పోలీసులు క్రైం నెం. 259/2025 ద్వారా T న్యూస్ రిపోర్టర్ పై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టంలోని 151, 196, 353(2), రెడ్ విత్ 3(5), రెడ్ విత్ 62 సెక్షన్ల కింద సాంబపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే యూరియా అంశంలో రైతాంగ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు వెళ్లిన తమ రిపోర్టర్ పై పోలీసులు అక్రమ కేసు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు, ఆ పార్టీకి చెందిన సమాచార, ప్రసార గొంతుకలైన పత్రిక, టీవీ ఆరోపిస్తున్నాయనేది వేరే విషయం. ఈ ఘటనలో T న్యూస్ రిపోర్టర్ పై ఘోరమైన సెక్షన్ లు నమోదు చేశారని, కేసును ఉపసంహరించుకోవాలని కూడా జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఈ నేపథ్యంలో మొత్తం ఘటనలో జర్నలిస్టులు గమనించాల్సిన అంశమేమిటంటే..? సమస్య మనకు సాక్షాత్కరిస్తే అది వార్తాంశమవుతుంది. కానీ సమస్యను మనమే సృష్టిస్తే అందుకు బాధ్యులం మనమే అవుతాం. అదేవిధంగా రైతు ఉద్యమిస్తే, స్వచ్ఛందంగా గళమెత్తితే ఖచ్చితంగా అది వార్తే అవుతుంది. కానీ రైతును మనమే రెచ్చగొడితే.. అక్కడ జరగరాని ఘటన ఏదైనా జరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగితే అందుకు పూర్తి బాధ్యత కూడా మనదే అవుతుంది. కళ్ల ముందు కనిపించిన ఘటనను నివేదించడమే విలేకరి విధి. ఘటన జరిగే విధంగా వ్యవహరించడం మాత్రం అసలైన రిపోర్టర్ లక్షణం కానేకాదు. టీ న్యూస్ రిపోర్టర్ సాంబ ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడని ‘సమీక్ష’ పేర్కొనడం లేదు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడనే అభియోగంపై కేసులో నిందితునిగా మారాడనేది అతనిపై నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ చెబుతోంది.
కొణిజర్లకు చెందిన దళిత రైతు గంధం నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు, దాని ఆధారంగా పోలీసులు నమోదు చేసిన కేసులోని ఎఫ్ఐఆర్ లో పొందుపర్చిన సెక్షన్లు చెబుతున్న అంశం కూడా అదే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీ న్యూస్ రిపోర్టర్ సాంబ ఆయా చర్యలకు పాల్పడ్డాడనేది రైతు చేసిన ఫిర్యాదు, పోలీసులు నమోదు చేసిన కేసులోని ముఖ్యాంశాలు. ఇందులో నిజా నిజాలేమిటనేది కేసు దర్యాప్తు, విచారణ అనంతరం న్యాయస్థానంలోనే తేలుతుంది. అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే.. ఫీల్డులోకి వెళ్లి వృత్తిని మాత్రమే నిర్వహించే జర్నలిస్టులు తాము ప్రొఫెషనలిస్టులం మాత్రమేనని గుర్తించి నడుచుకోవలసిన అవసరముందనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.
కాగా ఈ కేసు అంశంలో తనను కలిసిన జర్నలిస్టులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఏమన్నారో తెలుసా? తమ ప్రభుత్వం జర్నలిస్టుల పక్షమేనని, జర్నలిస్టులు కూడా బాధ్యతతో వ్యవహరించాలని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తనపై కేసు నమోదు తర్వాత టీ న్యూస్ రిపోర్టర్ సాంబ అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలేమిటో తెలియదుగాని, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు తన కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలోగాని, అతనిపై కేసును ఉపసంహరించుకోవాలని జర్నలిస్టు సంఘాలు అధికార పార్టీ నాయకులను కలుస్తున్న సమయాల్లోని ఏ చిత్రాల్లో కూడా సాంబ కనిపించకపోవడం అతను ‘అజ్ఞాతం’లోకి వెళ్లాడనే ప్రచారానికి బలం చేకూరుస్తోందని జర్నలిస్టు వర్గాలు చర్చించుకుంటున్నాయి.

