చింతూరు: ఏపీలోని అల్లూరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు-మారేడుమిల్లి మార్గంలోని ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్టవద్ద ఓ ప్రయివేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మృతులు చిత్తూరు జిల్లాకు చెందినవారుగా సమాచారం. ప్రమాద సమయంలో ఇద్దరు డ్రైవర్లు సహా 35 మంది వరకు బస్సులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రయివేట్ ట్రావెల్స్ కు చెందిన AP39 UM6543 అనే నెంబర్ గల బస్సు అరకు నుంచి భద్రాచలం వైపు ప్రయాణిస్తుండగా రాజుగారిమెట్ట వద్ద అదుపు తప్పి లోయలో పడింది. చిత్తూరు జిల్లాకు చెందినవారేగాక, బెంగళూరుకు చెందిన వారు కూడా కొందరు తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు బయలుదేరినట్లు తెలుస్తోంది. గురువారం అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించిన బస్సులోని ప్రయాణీకులు భద్రాచలం వెడుతుండగా ఆ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలానికి అంబులెన్సులు, పోలీసు వాహనాలు చేరుకుని సహాయక చర్యలు అందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను తొలుత చింతూరులోని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్నవారిని భద్రాచలం, రాజమండ్రి ఏరియా ఆసుపత్రులకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యల్లో స్థానికులు కూడా పాలు పంచుకుంటున్నారు. ప్రమాద స్థలంలో బాధితుల రోదనలు హృదయవిదారకంగా ఉన్నాయి.
కాగా ఈ బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స కోసం అవసరమైన ఆదేశాలను జారీ చేశారు.

