బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 18వ తేదీన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పర్యటనకు వస్తున్నారు. కేటీఆర్ శుక్రవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావలసిందిగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈమేరకు వద్దిరాజు కేటీఆర్ పర్యటనకు సంబంధించిన వివరాలతో ప్రకటన విడుదల చేశారు.
కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఖమ్మం చేరుకుని కవిరాజు నగర్ లోని దివంగత మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని ఎంపీ రవిచంద్ర తెలిపారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం చేరుకుంటారని చెప్పారు. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాతృమూర్తి లక్ష్మీనర్సమ్మ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని రవిచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాలకు పార్టీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావలసిందిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన ప్రకటనలో పిలుపునిచ్చారు.
