Friday, March 6, 2026

Top 5 This Week

Related Posts

కాంగ్రెస్ నేత విగ్రహానికి కేటీఆర్ నివాళి! మానుకోటలో వెరీ ఇంట్రస్టింగ్ సీన్!!

(‘సమీక్ష’ మార్క్ ప్రత్యేక కథనం)
ఫొటోను నిశితంగా చూడండి. ఓ నాయకుడి కాంస్య విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న దృశ్యమిది. చిత్రంలో గులాబీ పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా ఉన్నారు.

ఇంతకీ కాంస్య విగ్రహ రూపంలో గల ఆ నాయకుడు ఎవరో తెలుసా? గులాబీ పార్టీకి చెందిన నాయకుడు మాత్రం కానేకాదు. నిఖార్సయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అతని పేరు నూకల రామచంద్రారెడ్డి. ప్రస్తుత మహబూబాబాద్, ఒకప్పటి డోర్నకల్ నియోజకవర్గంలో గల జమాండ్లపల్లికి చెందిన నాయకుడే నూకల రామచంద్రారెడ్డి. మానుకోట కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎంపీ బలరాంనాయక్ తదితరులతోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు కూడా పాల్గొనడం అసలు విశేషం.

నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి, పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్, తక్కళ్లపల్లి రవీందర్ రావు (కుడివైపున)

అదేమిటీ.. కాంగ్రెస్ నాయకుడి విగ్రహావిష్కరణ, అదే పార్టీకి చెంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా జరిగితే ఆయా కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొనడమేంటి? ఆ తర్వాత కేటీఆర్ అతని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడమేంటి? అనే ప్రశ్నలు తలెత్తడం వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది. అధికార, విపక్ష నేతలను కలిపిన ఈ ఆవిష్కరణ దృశ్యం ఆత్యంత ఆసక్తికరం కూడా.

ఇంతకీ ఎవరీ నూకల రామచంద్రారెడ్డి?
నూకల రామచంద్రారెడ్డి మానుకోట ప్రాంతంలో తిరుగులేని కాంగ్రెస్ నాయకుడు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి 1957, 1962, 1967, 1972 సంవత్సరాల్లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద ఆర్థిక, రెవెన్యూ వంటి కీలక శాఖలకు మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీతో ఎనలేని అనుబంధాన్ని పెనవేసుకున్న నూకల రామచంద్రారెడ్డి మానుకోట ప్రాంతంలో ఇప్పటికీ మర్చిపోలేని రాజకీయ చరిత్రను సముపార్జించుకున్నారు.

తొలిదశ తెలంగాణా ఉద్యమంలో నూకల రామచంద్రారెడ్డి పాత్ర మరువలేనిది. ఓ ముప్పయి మంది ఎమ్మెల్యేలను వెంటేసుకుని ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేసిన నాయకుడు. తెలంగాణా యునైటెడ్ ఫ్రంట్ కు నాయకత్వం వహించిన చరిత్రను నూకల కలిగి ఉన్నారు. ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ తరపున ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావలసిన పొలిటికల్ హిస్టరీ గల కాంగ్రెస్ నాయకుడే నూకల రామచంద్రారెడ్డి.. 1974లో చనిపోయారు.

మహబూబాబాద్ కలెక్టరేట్ ను కేసీఆర్ ప్రారంభించినప్పటి చిత్రం (ఫైల్)

ఈ నేపథ్యంలోనే 2023 జూన్ 12వ తేదీన మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన అప్పటి సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నూకల రామచంద్రారెడ్డి ప్రస్తావన తీసుకువచ్చారు. తాను చదివిన పుస్తకాల ద్వారా తెలుసుకున్నారో, లేక అతని పొలిటికల్ హిస్టరీ గురించి అవగాహనను కలిగి ఉన్నారోగాని, కలెక్టరేట్ ప్రారంభోత్సవ ప్రసంగంలో కేసీఆర్ నూకల రామచంద్రారెడ్డి గురించి ప్రస్తావించారు. తొలిదశ తెలంగాణా ఉద్యమంలో చెరగని ముద్రవేసి, గుర్తుండిపోయే పాత్రను నిర్వహించిన నూకల రామచంద్రారెడ్డి విగ్రహానికి ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అప్పుడే అధికారులను ఆదేశించారు. విగ్రహ ఏర్పాటుకు 23 కుంటల ప్రభుత్వ స్థలాన్ని కూడా సేకరించారు.

విగ్రహావిష్కరణ అనంతరం నూకల రామచంద్రారెడ్డికి నివాళి అర్పిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఈ నేపథ్యంలోనే నూకల రామచంద్రారెడ్డి విగ్రహం మానుకోట కలెక్టరేట్ సమీపాన ఏర్పాటు చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు పాల్గొనడం, ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ సర్పంచుల సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్ అదే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం విశేషం. కాంగ్రెస్ నాయకుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి వెనుక ఇదీ అసలు కథ.

రాజకీయాల్లో విలువలకు ‘నూకల’ నిలువుటద్దం: పొంగులేటి
ఇదిలా ఉండగా రాజకీయాల్లో విలువలకు నిలువుటద్దంగా, నిరుపేదల ఆశాజ్యోతిగా వెలిగిన మహోన్నత నాయకుడు స్వర్గీయ నూకల రామచంద్రారెడ్డి అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, నూకల రామచంద్రారెడ్డి భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, తన జీవితాంతం సామాన్యుల కోసమే తపించారని శ్లాఘించారు. ముఖ్యంగా రెవెన్యూ మంత్రిగా ఆయన చేసిన భూ సంస్కరణలు విప్లవాత్మకమైనవని, నేటి తరానికి ఆయనొక దిక్సూచిగా చెెప్పారు. బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చడంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. గత పాలకులు రామచంద్రారెడ్డి విగ్రహ పనులను అసంపూర్తిగా వదిలేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధ్యతగా పూర్తి చేసిందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఒక ప్రధాన నీటి కాల్వకు లేదా మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెట్టే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలోనే శుభవార్త చెబుతామని పొంగులేలి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.

Popular Articles