Top 5 This Week

Related Posts

బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఖర్చెంతో తెలుసా!?

మరికొద్ది గంటల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. 24 ఏళ్లు నిండి 25వ ఏడులోకి ప్రవేశిస్తున్న పార్టీకి పాతికేళ్ల పండుగ నిర్వహించడం ఓ ప్రత్యేకత. కారణం ఏదైనా కావచ్చు 25 ఏళ్లు నిండకుండానే ఏడాది పొడవునా రజతోత్సవ సంబరాలను నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్న ప్రాంతీయ పార్టీ. తెలంగాణా మలిదశ ఉద్యమం, కేసీఆర్ పడిన కష్టం, ఉద్యమంలో తన కష్ట, సుఖాల్లో పాలు పంచుకున్న సహచర నాయకులకు అనేక మందికి లభించిన ప్రతిఫలం, చేదు అనుభవాలను చవి చూసిన మరికొందరి నేతల చరిత్ర.. ఇవన్నీ గులాబీ పార్టీ రాజకీయ పుస్తకంలోని వివిధ పేజీలు. వీటి గురించి పుంఖాను పుంఖాలుగా వెలువడిన వార్తా కథనాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వేదికగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెడుతున్న ఖర్చు ఎంత? ఇదీ ఇప్పుడు అసలు చర్చ. ప్రభుత్వ నిఘా వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ సాగుతున్న ఆసక్తికర చర్చ.

ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావనంతరం పదేళ్ల పాలనలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న బీఆర్ఎస్ పార్టీ దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీ. ఈ విషయం ఎవరో గిట్టని పార్టీ వాళ్లు చెబుతున్నది కాదు. స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించిన సంగతి తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ ఖర్చు చేసిన మొత్తంపై ఆడిట్ నివేదికను సమర్పించగా, ఎలక్షన్ కమిషన్ ఆయా వివరాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. ఆ నివేదికలోని వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ ఖాతాల్లో 2024 నవంబర్ నాటికే అక్షరాలా పధ్నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల నిల్వలు ( రూ. 1,449 కోట్టు) ఉన్నాయి.

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన RRR సినిమా గ్రాస్ కలెక్షన్లు రూ. 1,236 కోట్లు మాత్రమే. నిధుల పరంగా రాజమౌళి తీసిన సినిమా కలెక్షన్లను సునాయసంగా దాటేసిన బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీల్లో ఆర్థికంగా నంబవర్ వన్ గా నిలిచి చరిత్రను సృష్టించింది. రజతోత్సవ సంబురాలకు ఎంచుకున్న ఎల్కతుర్తి సభా వేదికను ‘బాహుబలి’ వేదికగా అభివర్ణిస్తుండడం యాధృచ్చికమే కావచ్చు. ఈ వేదికపై 500 మంది నాయకులు కూర్చునే సౌలభ్యం ఉందట. సభాస్థలి విస్తీర్ణం 1,213 ఎకరాలు కాగా, పార్టీ అంచనా ప్రకారం పది లక్షల మంది సభకు హాజరవుతారట.

విపక్ష నేత హోదాలో అసెంబ్లీకి హాజరు కాకుండా ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి రజతోత్సవ సభా వేదిక ద్వారా పార్టీ చీఫ్ కేసీఆర్ వస్తుండడం మరో విశేషం. తన ‘స్థాయి’కి ఏమాత్రం తగ్గకుండా కేసీఆర్ హెలీకాప్టర్ ద్వారానే ఈ సభకు హాజరవుతారట. తమ నాయకుడు సీఎం హోదాలోనే తిరిగి అసెంబ్లీలోకి అడుగిడుతారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా చెబుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్న ఈ సభ ద్వారా అనేక ప్రయోజనాలను పార్టీ ఆశిస్తుండవచ్చు. ముఖ్యంగా భారీ జనసమీకరణ ద్వారా పార్టీ కేడర్ చేజారకుండా కాపాడుకోవడం, స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం ఈ సభ సక్సెస్ ఉపకరిస్తుందని అంచనా వేస్తుండడం, పార్టీని వీడిన నాయకులు తిరిగి వస్తారని ఆశించడం వంటి అనేక ముఖ్యాంశాలు రజతోత్సవ సభ విజయవంతంలో దాగి ఉన్నట్లు గులాబీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో తన ఆర్థిక స్థితి స్థాయిలోనే పార్టీ ఈ సభను నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సభ విజయవంతం కోసం పార్టీకి చెందిన నాయకులు చెమటోడుస్తున్నారు. జనాన్ని సభకు తరలించేందుకు కేవలం ఆర్టీసీ బస్సుల కోసమే టీజీఎస్ఆర్టీసీకి రూ. 8.00 కోట్ల మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి దూరాభారాన్ని బట్టి నిర్ణీత మొత్తంలో నిధులు వ్యయం చేస్తున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో రూ. 25.00 లక్షల నుంచి రూ. 30.00 లక్షల వరకు జనసమీకరణకు వ్యయం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నాయి. జనరల్ నియోజకవర్గాల్లో కనిష్టంగా రూ. 50 లక్షలు, గరిష్టంగా రూ. 80 లక్షల చొప్పను జనసమీకరణకు ఖర్చు చేస్తున్నారట. అయితే వంద కిలోమీటర్లకుపైగా దూరంలో గల నియోజకవర్గాల్లో మాత్రమే ఆయా మొత్తాల చొప్పున ఖర్చు చేస్తున్నారట.

సభ జరిగే ఎల్కతుర్తికి సమీప దూరంలో గల ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఈ ఖర్చు కనిష్టంగా కోటి, గరిష్టంగా మూడు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం. జనసమీకరణకు చేసే ఖర్చులో కనీసంగా రూ. 50 కోట్ల వరకు ఈ జిల్లాల్లోనే ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే సభకు హాజరయ్యే వారికి దూరాభారాన్ని బట్టి కనిష్టంగా రూ. 200, గరిష్టంగా రూ. 1,000 వరకు నగదు రూపంలో, మార్గమధ్యంలో మటన్ భోజనం, కొందరి ‘అలవాటు’కు తగిన విధంగా ‘మద్య’స్థ ఏర్పాట్లు కూడా చేశారంటున్నారు.

ఇది గాక సభా వేదిక కోసం చదును చేసిన భూముల యజమానులకు సైతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత నగదును ముట్టజెప్పినట్లు ఇంకో కథనం వ్యాప్తిలో ఉంది. ఎకరానికి రూ. 30 వేల నుంచి 40 వేల చొప్పున మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల మొత్తాన్ని భూ యజమానులకు గౌరవప్రదంగా చెల్లింపులు చేసినట్లు భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాతిపదికన ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రజతోత్సవ సభ ఖర్చు కనీసం రూ. 200 కోట్ల వరకు ఉండవచ్చనే అంచనాలతో కూడిన వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జరుగుతున్న ఏర్పాట్లు, సమీకరణ లక్ష్యపు జనసంఖ్య, అందుకు జరుగుతున్న ఏర్పాట్లను లోతుగా పరిశీలిస్తే ఈ మొత్తం మరో రూ. 100 కోట్లకు పెరిగినా అశ్చర్యం లేదంటున్నారు.

మొత్తంగా పరిశీలించినపుడు బీఆర్ఎస్ పార్టీ పుట్టుకే కాదు, దాని అధినేత సాగించిన ఉద్యమ నేపథ్యం, రాజకీయంగా నిక్షిప్తమై ఉన్న గులాబీ పార్టీ చరిత్రకు ఏమాత్రం తగ్గకుండా ఎల్కతుర్తి సభా ఏర్పాట్లు కూడా చరిత్రాత్మకంగానే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్ ధనిక పార్టీ మాత్రమే కాదు.. ఆ పార్టీ 25 ఏళ్ల పండుగ సభ కూడా అత్యంత సంపన్నమైనదిగా కనిపిస్తుండడం అసలు విశేషం.

Popular Articles