Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

పాయె.., పార్టీ ‘ఇజ్జత్’ పాయె!?

దేశ ప్రజల చూపును తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నించిన ‘జాతీయ’ పార్టీ.. దేశ రాజకీయాల్లోనే చరిత్రాత్మక రీతిలో రాష్ట్రాన్ని సాధించడంలో కీలకంగా నిలిచిన ప్రాంతీయ పార్టీ.., పిడికెడు మందితో ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రాన్ని పోరాటాల ఉధ్రుతితో ఉర్రూతలూగించిన ఉద్యమ పార్టీ.. ఎంపీల సంఖ్యతో నిమిత్తం లేకుండా కేంద్ర పాలకుల మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించవచ్చని నిరూపించుకున్న పార్టీ.. కేసీఆర్ సచ్చుడో.., తెలంగాణా వచ్చుడో.. అంటూ నినదించిన లీడర్ సారధ్యపు పార్టీ.. ఉద్యమ పార్టీ కాస్తా ఫక్తు రాజకీయ పార్టీగా మారిన నేపథ్యం.. రాష్ట్ర సాధనలో కలిసివచ్చే గొంగళి పురుగులనే కాదు, పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వవచ్చని సరికొత్త రాజకీయ కోణాన్ని ఆవిష్కరించిన లీడర్.. వెరసి క్లుప్తంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన కేసీఆర్ సార్ పార్టీ చరిత..

తెలంగాణా రాష్ట్రం ఉన్నంతకాలం రాజకీయ చరిత్రలో నిలిచిపోయే అనేక పేజీలను సముపార్జించుకున్న కేసీఆర్ పార్టీ ఏమిటిలా నిస్సహాయంగా ఉండిపోయింది? చేష్టలుడిగి చూస్తోంది? రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలను చూసి కారు పార్టీ వెనుకంజ వేయడమేంటి? నేను కొడితే మామూలుగా ఉండదు.. కొడితే గట్టిగనే కొడతా..అంటూ ఫాం హౌజ్ లో గొంతు విప్పిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బయటకు వచ్చేదెన్నడు? కొద్దిసేపటి క్రితమే నామినేషన్ల గడువు కూడా ముగిసింది. ఆ పార్టీ అభ్యర్థులెవరూ ఎమ్మెల్సీ పోరు బరిలో ఉన్న దాఖలాలు లేవు. పార్టీకి చెందిన లీడర్లెవరూ కనీసం నామినేషన్ దాఖలు చేసిన సీన్ కూడా కనిపించడం లేదు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లోని ఏడు జిల్లాలైన మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ నియోజకవర్గాల్లో టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించవద్దని, ఎవరికీ మద్ధతు ఇవ్వకూడదని కూడా నిర్ణయించారట. కేటీఆర్, హరీష్ రావులు కేసీఆర్ తో సమావేశమైన సందర్భంలో ఈమేరకు స్పష్టమైన సంకేతాలు అందినట్లు వార్తల సారాంశం. కానీ తామెందుకు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామనే అంశంపై ఆ పార్టీ ముఖ్యనేతలెవరూ ప్రజలకుగాని, తమ కేడర్ కు గాని వివరణ ఇవ్వలేదనేది వేరే విషయం.

పదమూడు నెలల క్రితం అనూహ్యంగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు ఆ తర్వాత పరిణామాల్లో ఎక్కడా డీలా పడినట్లు కూడా కనిపించకపోవడమే విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫార్ములా ఈ రేస్ వ్యవహారం వంటి పలు అంశాల్లో విచారణలు, కేసుల నమోదు పరిణామాలను చవిచూస్తున్నప్పటికీ, తాము తగ్గేది లేదనే తరహాలోనే కేటీఆర్, హరీష్ లు కాంగ్రెస్ ప్రభుత్వంపై తమదైన రీతిలో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ‘సున్నా’ ఫలితాలు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ నేతల్లో ఆత్మస్థయిర్యం తగ్గినట్లు కూడా కనపించలేదనేది గులాబీ శ్రేణుల భావన. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో జైలు పాలైన పరిస్థితినీ పార్టీ చీఫ్ కేసీఆర్ తన ఫాం హౌజ్ లోనే గుంభనంగా దిగమింగారనేది పరిశీలకుల అంచనా.

మాజీ మంత్ర హరీష్ రావు

ఈ నేపథ్యంలోనే ఇటు కేటీఆర్, అటు హరీష్ పాలకపక్షాన్ని ఇరుకునపెట్టేందుకు తమవంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యాక ఈ మధ్యే రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. పార్టీ చీఫ్ కేసీఆర్ సార్ ఫాం హౌజ్ లో అప్పుడప్పుడు గర్జిస్తున్నారు. ‘ఏడాది అయ్యేపాయె.. మరో మూడేండ్లు గడిస్తే అధికారం మనదేనాయె.. నేను కొడితే మామూలుగా ఉండదు.. గట్టిగానే కొడతా..’ అంటూ సందర్భాన్ని బట్టి తనను కలిసిన వివిధ జిల్లాల పార్టీ కేడర్ తో గులాబీ బాస్ చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు లీకవుతూనే ఉన్నాయి. ప్రసార మాధ్యమాలు ఫుల్ ప్లేట్ ‘బ్రేకింగ్ న్యూస్’లు వేస్తూనే ఉన్నాయి. పార్టీ నాయకుల, కార్యకర్తల ఆత్మస్థయిర్యం దెబ్బతినకుండా గట్టి నమ్మకం కల్పించే దిశగానే కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయా ఉదంతాల్లో పరిశీలకుల వాదన.

వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలు సీఎంలుగా వ్యవహరించిన ప్రభుత్వాల హయాంలో అనేక డక్కీ, మొక్కీలు తిన్న గులాబీ పార్టీ మూడు ముఖ్య ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయకుండా దూరంగా ఉండడమే తెలంగాణా సాధించిన పార్టీ చరిత్ర పుటల్లో విషాద పేజీలుగానే అభివర్ణించాలి. చివరికి తమ అడ్డాగా, గడ్డగా చెప్పుకునే మెదక్ జిల్లాతో మిళితమై ఉన్న ఎమ్మెల్సీ స్థానానికీ కారు పార్టీ పోటీ పడకపోవడం మరో విచిత్రం. అంతేకాదు గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ ను ఉద్యమ సమయంలో నిర్బంధించిన జైలు గోడలను బద్దలు కొట్టే తరహాలో మద్ధతుగా నిలిచిన ఖమ్మంతో కూడిన ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు కారు పార్టీ ముందుకు రాకపోవడం గమనార్హం. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఓటర్లతో కూడిన ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు బీఆర్ఎస్ భయపడినట్లేనా? చదువుకున్న ఓటర్లు ఇంకా తమపై గుర్రుగా ఉన్నారని, కర్రు కాల్చి మళ్లీ వాత పెట్టవచ్చని భీతిల్లి, ఓటమి తప్పదని పోటీకి బీఆర్ఎస్ వెనుకంజ వేసినట్లేనా? ఇవీ తాజా ప్రశ్నలు.

ఎమ్మెల్సీ కవిత

మొత్తంగా పధ్నాలుగేళ్ల ఉద్యమ నేపథ్యంలో అనేక ఆటుపోట్లను, వెన్నుపోట్లను, నిర్బంధాలను, పలు ఎన్నికల్లో ఓటమి పరిణామాలనూ ఎదుర్కున్న బీఆర్ఎస్ పార్టీ కేవలం మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి దూరంగా ఉండడం గులాబీ పార్టీ శ్రేణులకు మింగుడు పడని అంశమే. పార్టీ పరంగా పరువు (ఇజ్జత్) పోయే నిర్ణయమే ఇది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. గెలుస్తామా? ఓడుతామా? అనేవి ప్రశ్నలు కాదు. పోరాడామా? లేదా? అన్నదే అసలు సిసలు ఆత్మస్థయిర్యం. తన మేథా శక్తితో, పోరాట పటిమతో రాజధానితో కూడిన రాష్ట్రాన్ని సాధించి, ఎంచుకున్న లక్ష్యాన్ని గురి తప్పకుండా కొట్టిన కేసీఆర్ వంటి లీడర్ మున్ముందు కొడితే గట్టిగానే కొడతారా? లేదా? అనే దృశ్యం స్థానిక ఎన్నికల్లోనైనా సాక్షాత్కరిస్తుందో లేదో చూడాలి..

-ఎడమ సమ్మిరెడ్డి

Popular Articles