ఖమ్మం: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. మరికొద్ది గంటల్లో.. శుక్రవారం ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో గులాబీ పార్టీ అలెర్ట్ కావడం గమనార్హం. ఈమేరకు సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మున్సిపాలిటీలో పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసిన 20 మందిని ఆ పార్టీ నాయకులు రహస్య ప్రదేశానికి తరలించారు.
కల్లూరులో కాంగ్రెస్-బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య హోరా హోరీ పోరు జరిగిన నేపథ్యంలో గులాబీ పార్టీ అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలకు పాల్పడడం గమనార్హం. మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ విషయంలో ఏదేని తేడా వచ్చినా, లేదంటే గెలిచిన తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేయవచ్చనే అనుమానంతో ముందస్తుగా ఈ చర్యకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.

