వక్ఫ్ సవరణ బిల్లును తాము రాజ్యసభలో వ్యతిరేకించినట్లు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే. ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్రలు చెప్పారు. ముస్లింల మనోభావాలను తమ పార్టీ బీఆర్‌ఎస్ మొదటి నుంచి గౌరవిస్తున్నదని, ఇక ముందు, ఎప్పటికీ కూడా గౌరవిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అబద్దాలు చెప్పి, అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని వారు విమర్శించారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, రవిచంద్రలు ఢిల్లీ తెలంగాణ భవన్ లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
ముస్లింలకు వ్యతిరేకమైన వక్ఫ్ సవరణ బిల్లును బీఆర్‌ఎస్ రాజ్యసభలో వ్యతిరేకించిందని ఈ సందర్భంగా తెలిపారు. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ, ప్రజల పక్షాన పోరాడడంలో ముందున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నదని సురేష్ రెడ్డి, రవిచంద్రలు వివరించారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీని తాము అడుగడుగునా అడ్డుకుంటున్నట్లు చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు మంచిదని వారు ఆలోచన చేసుంటే రంజాన్ పండుగకు ముందే పార్లమెంటులో ప్రవేశపెట్టి రంజాన్ తోఫా అని చెప్పుకునేవారని వద్దిరాజు రవిచంద్ర అభిప్రాయపడ్డారు

