బీఆర్ఎస్ పార్టీకి చెందిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ ప్రకటించారు. శాసనసభలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.
సస్పెన్షన్ తర్వాత సభ నుంచి వెళ్లిపోవాలని జగదీష్ రెడ్డిని స్పీకర్ ఆదేశించారు. దీంతో కేసీఆర్ ఛాంబర్ కు వెళ్లిన జగదీష్ రెడ్డి వద్దకు వచ్చిన చీఫ్ మార్షల్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. మరోవైపు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. అసెంబ్లీలో కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ప్రజా హక్కులను కాపాడాలని కోరినందుకు సభ నుంచి బహిష్కరించడం అన్యాయమని, ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిపక్ష గొంతు నొక్కుతున్న ప్రభుత్వం వైఖరిని ఖండిస్తున్నట్లు చెప్పారు.