Saturday, September 6, 2025

Top 5 This Week

Related Posts

తెలంగాణా ‘బాపూ..’! చూస్తున్నావా.. ఆడబిడ్డపై ఈ దాడి..!?

కల్వకుంట్ల కవిత రాజకీయంగా తప్పటడుగు వేసిందా? సరైన దిశలోనే పయనిస్తోందా? అనేది వేరే విషయం. కానీ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశాక.., మీరెంత? మీ పార్టీ ఎంత? అనే రీతిలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశాక బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యల దాడి జనంలో భిన్న చర్చకు తావు కల్పించాయి. ఎవరో అనామక కార్యకర్తో, అడ్రస్ లేని గల్లీ లీడరో కవితపై నోరు పారేసుకున్నారంటే పట్టించుకోవలసిన అవసరం ఉండకపోవచ్చు. కానీ పార్టీకే చెందిన కాస్త గుర్తింపు గల నాయకులు కూడా కవిత వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తుండడం తెలంగాణా సమాజంలో చర్చకు దారి తీస్తోంది.

వీరమళ్ల ప్రకాష్ రావు తెలుసు కదా? ములుగు జిల్లా పాలంపేటకు చెందిన వీరమళ్ల ప్రకాష్ రావు పూర్వకాలంలో న్యాయవాది కూడా. వి. ప్రకాష్ గా ప్రాచుర్యం పొందిన ఇతను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణా వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా పని చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పై కవిత ఇటీవల ఆరోపణలు చేసిన నేపథ్యంలో కవిత తీరుపై వి. ప్రకాష్ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వివిధ వార్తా ఛానళ్లలోనే కాదు, పెద్దగా జనంలో తెలియన యూ ట్యుబర్లతోనూ ఆయనేమంటారంటే..?

‘కవిత హరీష్ రావు కుటుంబంలో కోడలు కావలసి ఉండే.. హరీష్ రావు తమ్మునితో పెళ్లి జరగాల్సి ఉండె.. కవిత దగ్గర మరకలు లేవా? ఆమె వెనకాల ఎన్ని మరకలు ఉన్నాయి? కేసీఆర్, కేటీఆర్ అనాలంటే అనకపోవునా? నేను అనాలంటే అనలేనా? నామీద ఎటువంటి ఆంక్షలు లేవు కదా? గంట సేపట్లో ఆమెను రాజకీయంగా బొందపెట్టగలను. ఐదారు నెలలు కవిత ఎక్కడికైనా వెళ్లిపోవాలి. రేపటి నుంచి ఖబర్దార్ అని చెప్తున్నా.. ’ ఇటువంటి అనేక వ్యాఖ్యల సారాంశంతో సాగాయి వి.ప్రకాష్ వ్యాఖ్యలు వివిధ ప్రసార మాధ్యమాల్లో.. హరీష్ రావు, సంతోష్ కుమార్ ల భుజాలపై తుపాకీ పెట్టి కేసీఆర్ ను, కేటీఆర్ ను, తెలంగాణా అస్థిత్వాన్ని కాలుస్తోందని కూడా ప్రకాశరావు ఆరోపించారు. తనపై కవిత చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని సాక్షాత్తూ హరీష్ రావు పేర్కొన్న పరిణామాల్లో వి. ప్రకాష్ వంటి నాయకుడే కాదు, అడ్రస్ లేని గులాబీ కార్యకర్తలు సైతం కేసీఆర్ బిడ్డపై నోరు పారేసుకుంటుండడడం గమనార్హం.

ఈ తాజా పరిణామాలపై సీనియర్ జర్నలిస్ట్ మణిభూషణ్ భిన్నకోణంలో రాసిన ఆసక్తికర వ్యాసం సమీక్ష పాఠకుల కోసం..
ఫ్యామిలీ సపోర్ట్ ఏమాత్రం లేని ఏకాకి.
కవిత జోష్ కి, జోరుకి తట్టుకోలేని వర్గాలు మొదటి నుంచీ ఆమెను టార్గెట్ చేసుకున్నాయి.
లిక్కర్ స్కాం అనుకోని వరంలా దక్కేటప్పటికి మొత్తం పరాజయ భారం ఆమెపై నెట్టేశారు.

ఇలాంటి సందర్భాలు మరే రాష్ట్రంలోనైనా ఎదురైతే ఇలాగే పార్టీ, ఫ్యామిలీ డీల్ చేస్తాయా! గతంలో ఇటువంటి సమయాల్లో ఆయా పార్టీలు ఎలా వ్యవహరించాయి?

పొరుగున ఉన్న తమిళనాడులో కనిమొళికి, ఏపిలో జగన్మోహన్ రెడ్డికి దక్కిన ఫ్యామిలీ సపోర్టులో చారాణా మందం కవితకు లభించిందా!

కవిత అరెస్టయితే తండ్రి కేసీఆర్ కదల్లేదు.
కనిమొళి విషయంలో సవతి అన్నలు సహా కుటుంబమంతా వెనక నిలిచింది. కనిమొళిని ఆమె పార్టీ DMK సమర్ధించిన UPA ప్రభుత్వమే అరెస్ట్ చేయించింది. 2G స్కాం, కలైంజర్ టీవీ స్కాం పేరుతో సుమారు ఆరు నెలలపాటు కనిమొళి తీహార్ జైలులో గడిపారు. 2G స్పెక్ట్రమ్ అమ్మకంలో రూ.200 కోట్ల పై చిలుకు లంచాలు తీసుకుని, పెద్దమ్మ దయాళ్ (సవతి తల్లి)తో కలిసి కలైంజర్ టీవీ స్థాపించారన్నది కనిమొళిపై ఆరోపణ. బెయిల్ సైతం రాలేదు.

ఈ మొత్తం వ్యవహారంలో DMK శ్రేణులు ఎక్కడా నోరు జారలేదు. స్వయానా కరుణానిధి -అప్పటికే 88 ఏళ్ల వయోభారంతో అనారోగ్యంతో వీల్ చైరుకి పరిమితమైనప్పటికీ- ఒకటికి రెండుమార్లు ఢిల్లీ వెళ్లి జైలులో కూతురిని, ఇవే కేసుల్లో అరెస్టయిన ఇతర డీఎంకే ఎంపీ రాజాని కూడా పరామర్శించారు. సోనియా గాంధీని కలిసి మాట్లాడారు. కనిమొళి తల్లి రాజాత్తి (కరుణ మూడో భార్య), రెండో భార్య కొడుకు అళగిరి కూడా కరుణానిధి వెంట జైలుకెళ్లి పరామర్శించారు.
ఆ స్కాంలన్నీ దరిమిలా కొట్టేశారు.

కరుణానిధి 2018లో చనిపోయారు. స్టాలిన్ తన సవతి తల్లి కూతురైన చెల్లెలిని గాలికి వదిలేయలేదు. తూత్తుకుడి (Thoothukkudi) నుంచి రెండుసార్లు (2019, 2024) టికెట్టిచ్చి గెలిపించి లోకసభకు పంపారు.

ఇక, YSR CP అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అతని కుటుంబం ఎంతగా వెనకేసుకొచ్చిందో, తోబుట్టువు షర్మిల రేయింబవళ్లు తిరిగి ఎలా అండగా నిలిచిందో కొత్తగా చెప్పనక్కర లేదు.

ఇక్కడ కవిత విషయానికొచ్చేసరికి మొత్తం ఉల్టా నడుస్తోంది. సందుకొక ఛానల్, వీధికొక E-paper నడుస్తున్నందువల్ల ఎడా పెడా కవితను మాటలతో కుమ్మేస్తున్నారు! ఎక్కడివరకు పోయారంటే… హరీశ్ రావు తమ్ముడితో నిశ్చితార్థం జరిగి రద్దయిందని, కవితలో ఆ అవమానం రగులుతోందని చెబుతున్నారు! అదెప్పుడో పాతికేళ్ల క్రితం నాటి ఊసు. కవితకు 2003లో దేవనపల్లి అనిల్ కుమారుతో పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారు.

తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ touch me notగా ఉండేసరికి… పార్టీ వర్గాలు taken grantedగా anti-Kavita propaganda ఉధృతం చేశారు.

కవిత తప్పు చేస్తే, లిక్కర్ వగైరా స్కాంలల్లో ఆమెను గిల్టీగా నిర్ధారించాల్సిన వ్యవస్థలు వేరు. దర్యాప్తు సంస్థలున్నాయి, వాటి నివేదికలు, ఛార్జిషీట్ల ఆధారంగా దండించడానికి జ్యూడీషియరీ సిస్టమ్ ఉంది. ఛానళ్లలో డిస్కషన్ల ద్వారానో, సోషల్ మీడియాలో కథనాల ద్వారానో తీర్పులు వెలువడవు. అవి అసలు ఏ రకంగానూ, ఏ విధంగానూ వ్యవస్థల్ని ప్రభావితం చేయలేవు.

Popular Articles