కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారపు కేసులో ఈనెల 8వ తేదీన విచారణకు హాజరైన తర్వాత బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సంజయ్ 48 గంటల్లోగా బేషరతుగా ఉపసహరించుకోవాలని, లేదంటే లీగల్ నోటీసు పంపిస్తానని కేటీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ కు కేటీఆర్ తన న్యాయవాదుల ద్వారా మంగళవారం లీగల్ నోటీసులు పంపించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ అసత్యాలు వల్లించారని, కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని, ఒక ప్రజాప్రతినిధిగా అసత్యాలు మాట్లాడడం సరికాదని లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయ ఉనికికోసం సంజయ్ అసత్యాలు మాట్లాడారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మున్ముందు ఇటువంటి అసత్య వ్యాఖ్యలు చేయవద్దని, లేదంటూ క్రిమినల్ చర్యలకు కూడా బండి సంజయ్ బాధ్యులవుతారని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.
