ఆ మధ్య పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాలో జర్నలిజంపై వేసిన సెటైర్లు ఒకానొక తెలుగు టీవీ ఛానల్ తీరును పరోక్షంగా ఎండగట్టాయి. క్రియేటివ్ జర్నలిజం, ముందస్తు చర్యల పేరుతో చేసే వికృత విన్యాసాల జర్నలిజంపై విసిగిన హీరో సదరు ఛానల్ సూత్రధారి చెంపలను చెడామడా వాయించేస్తుంటాడు. బజారులో ఉండాల్సిన చెత్తను తీసుకువచ్చి నట్టింట్లోకి ప్రవెశపెట్టిన తీరును హీరో పాత్రధారి ఎండగడతాడు. ఇదో టైపు జర్నలిజం.. ఇప్పటికీ అప్పుడప్పుడు కొన్ని ఛానళ్లో దర్శనమిస్తుంటుంది. శృతి మించిన క్రియేటివిటీ జర్నలిజపు బాపతు అన్నమాట.
కానీ ఎంపిక చేసుకున్న ఓ వృద్దున్ని బీఆర్ఎస్ ఆఫీసుకు తీసుకువచ్చి, రాష్ట్ర ముఖ్యమంత్రిని బూతులతో ఎలా తిట్టాలో తర్ఫీదునిచ్చి మరీ వీడియోలు చిత్రీకరిస్తే దాన్ని ఏ టైపు జర్నలిజం అనాలి? ఇలా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసిన వారిని ఏ తరహా జర్నలిస్టులుగా భావించాలి? నిజానికి యూ ట్యూబర్ల హవా పెరిగిన తర్వాత ఎవరు జర్నలిస్టు? ఎవరు నాన్ జర్నలిస్టు? అనే ప్రశ్నలకు సరైన జవాబు లేకుండా పోయింది. ఏది పడితే అది వీడియో తీసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయడమే జర్నలిజంగా అనేక మంది భావిస్తున్నారు. నోరేసుకుని బూతులు మాట్లాడేవారే అసలైన జర్నలిస్టులుగా తమకు తాము ప్రమోట్ చేసుకుంటున్నారు.

ఈ టైపులో యూ ట్యూబుల్లో ఫేమస్ అయినవాళ్లలో చాలా మంది తమకు తాము తీన్మార్ మల్లన్నలుగా భ్రమిస్తున్నారు. ఓ తెలుగు పదాన్ని సైతం సరిగ్గా పలకరానివాళ్లు కూడా యూ ట్యూబుల్లో మార్నింగ్ లైవ్ ల పేరుతో జర్నలిస్టులుగా చెలామణిలో ఉన్నారు. ఈ ప్రక్రియ ద్వారా అటు ప్రభుత్వాన్ని, ఇటు ముఖ్యమంత్రినీ, వీలైతే తమకు గిట్టని మంత్రులను, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ దూషణపర్వంతో చెలరేగుతున్నారు. ఇటువంటి యూ ట్యూబర్లకు జర్నలిజంలో ఎటువంటి శిక్షణ ఉండకపోవచ్చు. వ్యూస్ పెరిగితే యూ ట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయనే ఆశతో నోటికి పని చెబుతూ ఉండవచ్చు. కానీ ఓ శాటిలైట్ న్యూస్ ఛానల్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన రేవతి వంటి మహిళా జర్నలిస్టు కూడా బూతుల జర్నలిజాన్నే నమ్ముకుంటే ఎలా? ఇదీ తాజాగా తలెత్తుతున్న ప్రశ్న.
జర్నలిస్టుగా పేర్కొంటున్న రేవతి, ఆమె ఛానల్ లో రిపోర్టర్ గా చెబుతున్న తన్వి యాదవ్ అనే మహిళలను అరెస్టు చేసిన సందర్భంగా సైబర్ క్రైం అదనపు సీపీ విశ్వప్రసాద్ వెల్లడించిన వివరాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని చెప్పక తప్పదు. ఓ పొలిటికల్ పార్టీతో కుమ్ముక్కయి పల్స్ యు ట్యూబ్ ఛానల్ బాధ్యతరహితంగా వీడియోలు పోస్ట్ చేసిందని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ తో పాటు ప్రభుత్వ పథకాలను కించే పరిచే విధంగా పల్స్ యు ట్యూబ్ ఛానల్ వీడియోలు చేసిందని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి ఈ వీడియో తీసినట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. అమాయకులు, వృద్ధులతో కావాలని వీడియోలు చేసి సీఎంను తిట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఆయా వీడియోల్లో గల భాషను తానే మాట్లాడలేకపోతున్నట్లు అదనపు సీపీ పేర్కొనడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ నుండి ఫండింగ్ తీసుకుని పల్స్ యూ ట్యూబ్ ఛానెల్ ఈ విడియోలు తీసినట్లు కూడా ఆయన వివరించారు. బీఆర్ఎస్ పార్టీ పల్స్ టీవీకి ఆర్థిక సహాయం చేస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు.

ఆ మధ్య బీజేపీకి చెందిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్ల రూపాయలును ఖర్చు చేసి కేటీఆర్ ప్రత్యేకంగా సోషల్ మీడియా టీంలను పోషిస్తున్నారని, ప్రత్యర్థి పార్టీలపై విషం చిమ్మడానికి వీటిని ఉపయోగిస్తున్నారనేది రఘునందన్ రావు చేసిన ఆరోపణ. ఇద్దరు మహిళా యూ ట్యూబర్లు రేవతి, తన్వి యాదవ్ ల అరెస్టు సందర్భంగా అదనపు సీపీ విశ్వప్రసాద్ వెల్లడించిన వివరాలు రఘునందన్ రావు చేసిన ఆరోపణలకు బలం చేకూర్చాయనే చెప్పాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నట్టేనా? ఇదీ తాజా చర్చ.
తమ పార్టీ తరపున నిర్వహిస్తున్న మెయిన్ మీడియాకు తోడుగా సోషల్ మీడియాను కూడా బీఆర్ఎస్ నమ్మకుంటే తప్పేమీ లేదు. బూతుల భాషను కాకుండా రీతితో కూడిన వ్యాఖ్యలతో ప్రభుత్వ వైఫల్యాలను తమ పార్టీ మీడియాలోనూ ఎండగట్టవచ్చు. కానీ కొందరు వృద్దులను ఎంచుకుని, వారితో సీఎంను బూతులు తిట్టిస్తూ వీడియోలు చేసే మహిళా యూ ట్యూబర్లకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసునే కేంద్రంగా చేసి, వారికి పార్టీ తరపున ఫండింగ్ చేయడాన్ని తెలంగాణా సమాజాం ఎలా అర్థం చేసుకోవాలి? సైబర్ క్రైం సీపీ విశ్వప్రసాద్ మీడియా సమావేశంలో ఈ ఇద్దరు మహిళా యూ ట్యూబర్ల కార్యకలాపాల వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు క్లియర్ గానే చెప్పారు. తమ వద్ద ఆధారాలున్నట్లు కూడా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.

మహిళా యూ ట్యూబర్లు రూపొందించిన జుగుప్సాకర భాషతో కూడుకున్న వీడియోలు బీఆర్ఎస్ నేతలకు, ముఖ్యంగా కేటీఆర్ వంటి నాయకునికి శ్రవణానందకరంగానే ఉండవచ్చు. అందుకే కాబోలు ఆ మధ్య ఏదో సభలో కేటీఆర్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో జనం తిడుతున్న తిట్లు రేవంత్ రెడ్డికి పట్టడం లేదని, మరొకరైతే ఉరేసుకుని చచ్చేవారని వ్యాఖ్యానించినట్లు గుర్తు. రేవతి, తన్వి యాదవ్ అనే మహిళా యూ ట్యూబర్ల అరెస్టును బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కవితలతోపాటు ఆ పార్టీకి చెందిన మరికొందరు కూడా తీవ్రాతి తీవ్రంగా, ఖండ ఖండాలుగా ఖండించారు.
విషయమేమిటంటే ప్రస్తుతం అరెస్టయిన రేవతి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అరెస్టయింది. తనపై ప్రభుత్వం కక్ష గట్టిందని రేవతి అప్పట్లో ఆరోపించారు. ఈ ఘటన తర్వాత రేవతి నిర్వహించిన రవిప్రకాష్ సారధ్యంలోని మోజో టీవీ మూతపడింది. అప్పుడు గిట్టని రేవతి మార్క్ జర్నలిజం బూతుల భాషకు దిగిజారిన నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు నచ్చడమే అసలు కొసమెరుపు. ఇటువంటి ‘బూతుల జర్నలిజం’ వీడియోలను నమ్మకుని బీఆర్ఎస్ పార్టీ చేసే రాజకీయం ఆ పార్టీకి లబ్ధి చూకూరుస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిన అంశం.