గటిక విజయ కుమార్.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ! బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఓ వెలుగు వెలిగిన గటిక విజయ్ కుమార్ చాలా కాలం తర్వాత ప్రసార మాధ్యమాల్లో కనిపించడం విశేషం. సీఎం పీఆర్వోగా అధికార వర్గాల్లో ఆధిపత్య చక్రం తిప్పిన విజయ్ కుమార్ తీన్మార్ మల్లన్న వద్ద బీసీ జేఏసీ సమన్వయకర్తగా బుధవారం తెరపైకి రావడం గమనార్హం.
సరిగ్గా రెండు దశాబ్ధాల క్రితం వరకు కూడా సాధారణ జర్నలిస్టు జీవితాన్ని గడిపిన విజయ్ కుమార్ కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే సీఎం పీఆర్వోగా చేరారు. ఈక్వేషన్స్ ఏమిటో గాని కేసీఆర్ వంటి నాయకుడు విజయ్ కుమార్ ను పీఆర్వోగా నియమించుకోవడం జర్నలిస్టు వర్గాల్లో అప్పట్లో చర్చనీయాంశంగానే మారింది. ఆ తర్వాత కేసీఆర్ కు సన్నిహితునిగా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ ప్రగతి భవన్ లో కీలక వ్యక్తిగా మారారు. ముఖ్యమంత్రికి సీపీఆర్వోగా మరో వ్యక్తి ఉన్నప్పటికీ, విజయ్ కుమారే సీపీఆర్వో అనే తరహాలో ప్రాచుర్యం లభించింది.

అంతేకాదు విజయ్ కుమార్ కోసమే ట్రాన్స్ కో సంస్థ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యునికేషన్స్) పోస్టును క్రియేట్ చేసి ఎంపిక చేసి, నియమించుకుంది. కేసీఆర్ ఆదేశం మేరకే విజయ్ కుమార్ కోసం, అతని అర్హతలకు తగిన రీతిలో మాత్రమే ఈ పోస్టు క్రియేట్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఏమైందో ఏమోగాని 2021 మార్చి 3వ తేదీన గటిక విజయ్ కుమార్ అకస్మాత్తుగా సీఎం పీఆర్వో పోస్టుకు రాజీనామా చేశారు. ట్రాన్స్ కో జీఎం పోస్టుకు కూడా ప్రభుత్వం రాజీనాామా చేయించింది. ఈ పరిణామంపై అప్పట్లో భిన్న కోణాల్లో వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో ఆరోపణలతో కూడిన వివిధ వార్తా కథనాల్లో నిజానిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, అప్పటి నుంచి విజయ్ కుమార్ పెద్దగా వార్తల్లో లేరనే చెప్పాలి.
సరిగ్గా నాలుగేళ్ల నుంచి పెద్దగా ప్రాచుర్యంలో లేని విజయ్ కుమార్ ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు చెందిన డిజిటల్ విభాగానికి ఎడిటోరియల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఫోన్ టాపింగ్ కేసులో నిందితునిగా ఉన్న ఈ ఛానల్ ఓనర్ పారిపోయి ప్రస్తుతం విదేశాల్లో తల దాచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గటిక విజయ్ కుమార్ బుధవారం ప్రసార మాధ్యమాల్లో కనిపించడం విశేషం. కాంగ్రెస్ నుంచి సస్పెండయిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పక్కనే కూర్చుని మీడియా సమావేశంలో పాల్గొన్నారు విజయ్ కుమార్. బీసీ జేఏసీ సమన్వయకర్తగా విజయ్ కుమార్ ను మీడియాకు పరిచయం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే, సీఎం కేసీఆర్ తో ఏర్పడిన సాన్నిహిత్యంతో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం గటిక విజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని నెక్కండ మండల కేంద్రానికి చెందిన విజయ్ కుమార్ సీఎం పీఆర్వో పోస్టుకు రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులకు సంబంధించిన కీలక ఆధారాలను బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడొకరు కేసీఆర్ కు అందించినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. మొత్తంగా కేసీఆర్ వద్ద ఓ వెలుగు వెలిగిన విజయ్ కుమార్ తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకోవడానికి తాజాగా తీన్మార్ మల్లన్న వద్ద ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది.