‘సమీక్ష’ న్యూస్ చురకతో కేసీఆర్ మానస ‘పత్రిక’ ఉలిక్కపడి అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. గురువారం నాటి ‘నమస్తే తెలంగాణా’ పత్రిక మెయిన్ ఎడిషన్ ను పరిశీలించినపుడు… బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కీర్తికి అక్షరాభిషేకం చేస్తూ ప్రచురించిన అసందర్భ వార్తా కథనం ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. నిన్నటి తప్పిదానికి నష్టనివారణ చర్యలో భాగంగా, గులాబీ పార్టీ అధినేత గుండెను ఖుషీ చేసే అడుగుగా తాజా వార్తా కథనం స్ఫురిస్తోందనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. వేళకాని వేళ ‘కర్టెన్ రైజర్’ స్టోరీని తన పాఠకులకు గులాబీ బాస్ పత్రిక అందించడం వెనుక ‘సమీక్ష’ న్యూస్ నిన్న ప్రచురించిన కథనమే కారణంగా విశ్లేషించక తప్పదు. విషయంలోకి వెడితే..
స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణా తొలి ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను మంగళవారం కలిసిన నేపథ్యం, ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన కీలక వ్యాఖ్యలను కారు పార్టీ పత్రిక పెద్దగా పట్టించుకోలేదు. కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రముఖ పత్రికలతోపాటు వివిధ న్యూస్ ఛానళ్లు ప్రాధాన్యనిస్తూ ప్రచురించాయి.. ప్రసారం చేశాయి. కానీ తాను ఇష్టపడి, ఇతరుల నుంచి చేజిక్కించుకున్న తన పత్రికలోనే కేసీఆర్ కు దక్కని ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ ‘సమీక్ష’ నిన్న ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం అటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనేగాక, నమస్తే తెలంగాణా పత్రిక ఉద్యోగ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఆయా పరిణామాల్లో కేసీఆర్ మానస ‘పత్రిక’ నమస్తే తెలంగాణా గురువారం సంచలన రీతిలో స్పందించినట్లు ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ‘రజతోత్సవ సంరంభం, బీఆర్ఎస్ సన్నద్ధం’ శీర్షికతో బ్యానర్ స్టోరీని ప్రచురించడం విశేషం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గుండె నిండుగా నవ్వుతున్న నిలువెత్తు ఫొటోను కూడా ఈ వార్తకథనంలో ప్రచురించింది. మొదటి పేజీ బ్యానర్ స్టోరీలో ఇంట్రోను ఇచ్చిన పత్రిక మూడో పేజీలో దాదాపు ముప్పాతిక పేజీ స్థలంలో వార్తా కథనాన్ని ప్రచురించడం ప్రత్యేకత.

వచ్చే ఏప్రిల్ 27వ తేదీతో గులాబీ పార్టీకి 24 ఏళ్లు పూర్తవుతాయని, 25వ సంవత్సరంలోకి పార్టీ ప్రవేశిస్తుందని, పాలనలో కేసీఆర్ కు సాటెవ్వరని, శిఖరాయమాన కీర్తి కేసీఆర్.. అంటూ తన వార్తా కథనంలో పార్టీ చీఫ్ ను పత్రిక కొనియాడింది. అంతేకాదు కేసీఆర్ కేరికేచర్,కారుబొమ్మ, 25BRSలతో కూడిన లోగోను కూడా ఈ వార్తా కథనంలో ప్రచురించడం మరో విశేషం.
సాధారణంగా ఏదేని అంశానికిగాని, సంస్థకుగాని, పార్టీకిగాని 25 ఏళ్లు పూర్తయితేనే ‘రజతోత్సవం’గా వ్యవహరిస్తారు, అభివర్ణిస్తారు. కానీ 24 ఏళ్లు పూర్తి చేసుకుంటూ 25వ ఏట ప్రవేశిస్తే అది రజతోత్సవం ఎలా అవుతుంతో అర్థంకాని ప్రశ్న. టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ 2001 ఏప్రిల్ 27వ తేదీన ప్రారంభించారు. ఆ తేదీ రావడానికి మరో రెండున్నర నెలల వ్యవధి ఉంది. సాధారణంగా పత్రికల్లో ఇటువంటి అంశాల గురించి రాసే వార్తా కథనాలను ‘కర్టెన్ రైజర్’ స్టోరీగా వ్యవహరిస్తారు. సంబరానికి రెండు మూడు రోజులకు ముందో, ఇంకా ఉత్సాహం కలిగితే వారం ముందో, పది రోజుల ముందో రాస్తే అది కర్టెన్ రైజర్ స్టోరీ అవుతుంది. రెండున్నర నెలల ముందు, అదీ 24 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న పార్టీకి రజతోత్సవ సంబరం ఎలా అవుతుందో పత్రిక బాధ్యులే పరిశీలించుకోవలసిన అంశం.
మొత్తంగా చూసినపుడు నిన్నటి తప్పిదానికి నష్టనివారణ చర్యలో భాగంగానో, గులాబీ బాస్ గుస్సా చేయకుండా ఉండేందుకు ఆ పెద్దమనిషిని సంబురపరిచేందుకు మాత్రమే ‘రజతోత్సవ సంరంభం’ పేరుతో ఈ అసందర్భ బ్యానర్ స్టోరీని కేసీఆర్ మానస పత్రిక ప్రచురించి ఉండవచ్చనే వాదనలు ఆ సంస్థ పాత్రికేయ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. మొత్తంగా గులాబీ బాస్ కు తన మానస ‘పత్రిక’ ఎట్టకేలకు ప్రాధాన్యతనిచ్చింది. ఇందుకు గులాబీ పార్టీ శ్రేణులు సంబురపడాల్సిందే.

