(By Dr. S. Ramu)
ముందుగా, మహా టీవీ మీద జరిగిన దాడి దారుణం. పదేళ్ళు తెలంగాణను అనుకున్నంత బాగా పాలించలేకపోయిన బీఆర్ఎస్ వాళ్ళు తెగబడి మీడియా హౌస్ మీద దాడి చేయడం ఖండనార్హం. కార్లను ధ్వంసం చేయడమే కాకుండా… జర్నలిస్టులు, యాంకర్లు, టెక్నీషియన్స్ ఉన్న గది తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేసి, భయోత్పాతం సృష్టించడం అస్సలు బాగోలేదు. ఇది కేసీఆర్ మార్క్ రాజకీయం కాదే! నాయకులు నిస్పృహలోకి పోతే ఎట్లా? ఇంకా మూడేళ్ళు నెట్టుకురావాలంటే కాస్త ఓపిక ఉండాలి కదా! పదేళ్ళు కిందబడి మీదబడి నెట్టుకురాబట్టే కదా…కాంగ్రెస్ ను, బీజేపీ ని ప్రజలు ఆదరించారు.
అయితే, గులాబీ క్యాడర్ కు అంతగా కాలడం వెనుక మహాన్యూస్ వంశీ మాటల మంటలు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఆ థంబ్ నెయిల్స్, వ్యాఖ్యలు చూస్తుంటే… అది జర్నలిజం లాగాలేదు. మాటల దాడిలాగా ఉంది. అన్నింటికీ ఎస్ సార్…అనే రాజును బంటులాగా స్టూడియోలో కూర్చోబెట్టుకుని మీడియా కోటలు దాటే మాటలతో వారు రెచ్చిపోవడం నేను గమనించాను. ఆ వ్యాఖ్యలు ఒక పరిణతి చెందిన జర్నలిస్టు చేసిన వ్యాఖ్యల్లా లేవని నా మటుకు నాకు అనిపించింది. ఇన్నాళ్ళూ, పొలిటికల్ వ్యూహాలు లేక బండ రాజకీయం చేస్తున్న వైఎస్ఆర్ సీపీని చెడుగుడు ఆడుకున్న వంశీ ఇప్పుడు ఫోకస్ తెలంగాణ మీదకు మార్చారని ఫోన్ ట్యాపింగ్ కవరేజీని చూస్తే అనుమానం కలుగుతుంది.

అహంకారం, కండకావరం, బరితెగింపు ఎక్కువై రెండో టర్మ్ లో కంపు కంపు చేయబట్టే కదా… ఈడ్చి కొట్టారు జనం! అన్నింటి మీదా దర్యాప్తులు జరుగుతున్నాయి కదా! కొద్దిగా ఓపిక పట్టవచ్చు కదా, వంశీ! వేరే వాళ్ళ భార్యల ఫోన్ సంభాషణలు వినడమేమిటి? దీని మీద జాతిపిత నోరు మెదపరేం? అని వంశీ బాగా బాధపడుతున్నారు. దర్యాప్తు జరుగుతున్న, ఉచ్చు బిగుసుకుంటున్న కేసు గురించి ఆయన ఎప్పుడేమి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వగలరు, సామీ? మనం ఏదో ఒకటి చెప్పొచ్చు కదా! అంటే ఎట్లా? సార్, ఇరుక్కుంటే అధికారులు ఇరుక్కుంటారు గానీ, నాయకులు తేలిగ్గా బైటపడే కేసులా ఉంది ఇది. అప్పుడు మీ మీద పరువు నష్టం దావా చేస్తే ఇరుక్కునేది మీరే! సంయమనం, నిష్పాక్షికత పాటిస్తే మంచి పేరు వస్తుంది.
దర్యాప్తు బృందాలకు ట్యాపింగ్ బాధితులిచ్చిన స్టేట్మెంట్స్ పట్టుకుని అప్పుడే ఒక నిర్ధారణకు రావడం, జడ్జిమెంటల్ వ్యాఖ్యలు చేయడం సరికాదు. యువ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద అర్జెంటుగా ఒక నిర్ణయానికి రావడం పద్ధతి కాదు. ఆయన శుద్ధపూస అవునో కాదో దర్యాప్తులో తేలుతుంది. అందుకే చట్టాన్ని తన పని తాను చేసుకొనివ్వండి తీవ్రమైన వ్యాఖ్యలు మాని. ఒకవేళ అంత జర్నలిస్టిక్ దమ్ము ఉంటే ఫోన్ ట్యాపింగ్ ను అడ్డంపెట్టుకుని బెదిరిస్తే హోటల్స్ కు గానీ, గెస్ట్ హౌస్ లకు గానీ పోయి సమర్పించుకున్న వారిని ‘మీ టూ’ ఉద్యమం తరహాలో బయటికి పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి. ఆయన్ని అడ్డంగా బుక్ చేయండి. మనం ఎక్కువ ఉత్సాహం కనబరిస్తే నిజంగానే ఆయన దోషిగా తేలినా పబ్లిక్ సింపతీ ఆయన వైపే ఉంటుంది. ఏతావాతా జర్నలిస్టిక్ ఎథిక్స్ ను వంశీ పాటించాలి. చట్టాన్ని బీఆర్ఎస్ వాళ్ళు చేతుల్లోకి తీసుకోకూడదు.