హైదరాబాద్ లోని మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈమేరకు తన ట్విట్టర్ వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. మీడియా సంస్థలను నడుపుతున్న జర్నలిస్టుల ముసుగులో ఉన్న కొంతమంది గత కొన్ని నెలలుగా తనపై, తమ పార్టీ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. తాను వారి అభిప్రాయాలనుగాని, ఉనికినిగాని పట్టించుకోనప్పటికీ, పదేపదే జరుగుతున్న వ్యక్తిత్వ విధ్వంసం తన కుటుంబం, స్నేహితులు, పార్టీ సహచరులను దెబ్బ తీస్తోందన్నారు. తాను ప్రతి ఒక్కరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ఈ వ్యవస్థీకృత ప్రయత్నాల వెనుక ఎవరున్నారో తనకు పూర్తిగా తెలుసని, వారిపై తగిన విధంగా వ్యవహరిస్తానని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
