మావోయిస్టు పార్టీ వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ప్రెస్ నోట్ (పత్రికా ప్రకటన) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ ప్రెస్ నోట్ లోని ‘బాంబుల’ అంశమే అందుకు ప్రధాన కారణం. భిన్నవాదనల మధ్య వివిధ వర్గాల్లో చర్చకు దారి తీసిన ఆ ప్రెస్ నోట్ లోని సారాంశంలోకి వెడితే..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన తీరుపై తొలిపేరాలోనే మావోయిస్టు పార్టీ విరుచుకుపడింది. ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కారించడం లేదని విమర్శించింది. సామ్రాజ్యవాదం, దళారీ నిరంకుశ పెట్టుబడిదారులు, భూస్వాముల వంటి సహజ పదాలను ఉపయోగిస్తూనే భూములను అప్పగిస్తున్నారని, పోరాడుతున్నవారిపై పోలీసులతో అణచివేస్తున్నారని ఆరోపించింది.
అదేవిధంగా బహుళజాతి కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల అమలులో భాగంగానే బీజేపీ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీపై, ప్రజలపై, ప్రజా సంఘాలపై దాడులు చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ కూడా తమపై దాడులు కొనసాగిస్తున్నదని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. కగార్ ఆపరేషన్ లో తమ పార్టీ నాయకత్వంతోపాటు ఆదివాసీలు కూడా చనిపోతున్నట్లు పార్టీ పేర్కొంది.

అయితే కగార్ దాడులనుంచి రక్షణ పొందడానికి తాము కర్రెగట్టపై బాంబులు అమర్చినట్లు మావోయిస్టు పార్టీ తన ప్రకటనలో వెల్లడించడం గమనార్హం. ఈ విషయాన్ని తాము ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశామని, అయినప్పటికీ కొందరు ఆదివాసీలు, ఆదివాసేతర ప్రజలను పోలీసులు ఇన్ఫార్మర్లుగా మార్చుకుని షికారు పేరుతో కర్రెగట్టపైకి పంపిస్తున్నారనేది ఈ ప్రకటనలో మావోయిస్టు పార్టీ చేసిన ఆరోపణ.
దీంతో తమ రక్షణ కోసం అమర్చిన బాంబుల్లో పడి చనిపోతున్నారని, కొందరు గాయపడుతున్నారని, ఇన్ఫార్మర్లుగా మారి కుటుంబాలను కష్టాలపాలు చేయవద్దని, వేట పేరుతో కర్రెగట్టపైకి ఎవరూ రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ ప్రకటనలోని ప్రధాన సారాంశం. మావోయిస్టు పార్టీ వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రకటన ఎరుపు, నలుపు రంగు అక్షరాలతో డీటీపీ చేసినట్లు కనిపిస్తున్నప్పటికీ, ప్రకటనపై శాంత పేరు ఉన్నప్పటికీ, ఎటువంటి సంతకం లేకపోవడమే భిన్న చర్చకు తావు కల్పిస్తోంది. తమ రక్షణ కోసం కర్రెగట్టపై బాంబులు అమర్చిన విషయం వాస్తవమే అయితే ఆ అంశాన్ని పార్టీ ఎందుకు బహిర్గతం చేస్తుందనేది విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లో కలుగుతున్న సందేహం. ఒకవేళ మావోయిస్టు పార్టీ ఈ ప్రకటనను జారీ చేయకుంటే దీనివల్ల మరెవరికి ప్రయోజనం ఉందనేది మరో సందేహం.

అయితే బాంబులు అమర్చినట్లు మావోయిస్టు పార్టీ పేర్కొన్న ప్రాంతంపేరు కర్రెగట్ట కాకపోవడం గమనార్హం. నిజానికి ఆ ప్రాంతం పేరు ‘కరిగుట్ట’. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం పరిధిలోకి వచ్చే ఈ కరిగుట్ట ఛత్తీస్ గఢ్ లోని పూజారి కాంకేర్ జిల్లా సరిహద్దుల్లో ఉంటుంది. వెంకటాపురానికి సుమారు 20 కి.మీ. దూరంలో గల కరిగుట్ట మావోయిస్టుల కదలికలకు పెట్టని కోటగా పోలీసులు సైతం చెబుతుంటారు.
ఇటీవలి కాలంలో ఓ మహిళ, మరో పురుషుడు కరిగుట్ట ప్రాంత అటవీ ప్రాంతంలోకి వెళ్లి ప్రెషర్ బాంబులు పేలి అంగవైకల్యం చెందారు. ఆయా ఘటనల నేపథ్యంలోనే ఈ ప్రకటన వెలువడిందా? అనేది అసలు ప్రశ్న.

