Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

సీఎంను పనిచేయనివ్వడం లేదు: బీజేపీ అధ్యక్షుని సంచలన వ్యాఖ్యలు

ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిని పని చేయనివ్వడం లేదని తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు జిల్లాలకు చెందిన మంత్రులను ఆయన ‘బ్యాచ్’లుగా అభివర్ణిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఖమ్మం, నల్లగొండ బ్యాచ్ లు సీఎంను పని చేయనివ్వడం లేదన్నారు. ఖమ్మం మంత్రులు కనీసం జిల్లాలో పర్యాటక అభివృద్ధిని కూడా పట్టించుకోవడం లేదని, ప్రజాసమస్యలను కూడా పట్టించుకోకుండా సీఎం సీటు వైపు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన రామచందర్ రావు నగరంలో జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ ఆయా వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో మనకు అర్థం కావడం లేదన్నారు. సామాన్యంగా పార్టీ నాయకుడో, ముఖ్యమంత్రో పాదయాత్ర చేస్తారని, కానీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పాదయాత్ర చేేసే పరిస్థితి లేదన్నారు. కానీ పార్టీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ మాత్రం పాదయాత్ర చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రిని ఖమ్మం, నల్లగొండ బ్యాచ్ లు పాదయాత్ర చేయనివ్వవని అన్నారు. ఖమ్మం, నల్లగొండ బ్యాచ్ లు కలిసి ముఖ్యమంత్రిని పని చేయనివ్వడం లేదన్నారు.

ఖమ్మం ‘కామ్రేడ్స్’ బీజేపీలోకి వస్తామంటున్నారు:
కాగా ఖమ్మం కమ్యూనిస్టుల గడ్డగా ప్రచారం ఉండేదని, భవిష్యత్తులో ఖమ్మం బీజేపీ అడ్డాగా మారుతుందని రామచందర్ రావు అన్నారు. వెస్ట్ బెంగాల్ లో కమ్యూనిస్టులు అనేక మంది బీజేపీలో చేరారని, ఖమ్మం జిల్లాకు చెందిన కమ్యూనిస్టులు చాలా మంది తనతో మాట్లాడుతున్నారని, బీజేపీలో చేరుతామని అంటున్నారని, వారికి తానుస్వాగతం పలుతకున్నట్లు చెప్పారు. ‘రండి కలిసి పని చేద్దాం. అందరినీ ఆహ్వానిస్తున్నాను. కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రపంచం వ్యాప్తంగా వైఫల్యం చెందింది. పశ్చిమ బెంగాల్, కేరళలో బీజేపీ సీట్లు పెరుగుతున్నాయి, దేశం కోసం ధర్మం కోసం కలిసి పనిచేద్దాం.. రండి’ అని బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు ఖమ్మం కామ్రేడ్స్ కు పిలుపునిచ్చారు.

Popular Articles