మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటన రాజకీయంగా కలకలం రేపింది. మక్తల్ మున్సిపాలిటీలో ఆరోవార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహదేవప్ప (48) మంగళవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోషల్ మీడియాతో ప్రత్యర్థుల వేధింపులవల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు మహదేవప్ప భార్య సత్తెమ్మ ఆరోపించారు. మహదేవప్ప ఆత్మహత్య నేపథ్యంలో ఆరో యవార్డు ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కాగా మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అహంకారపూరిత రాజకీయాలు, మాఫియా బెదిరింపులవల్లే మహదేవప్ప ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోందని అన్నారు. మంత్రి శ్రీహరి, ఆయన అనుచరుల వేధింపులకు తాళలేక తమ పార్టీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. అతని కుటుంబానికి న్యాయం జరిగేవరకు బీజేపీ పోరాడుతుందని రామచందర్ రావు పేర్కొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా మహదేవప్ప ఆత్మహత్యోదంతంపై స్పందించారు. మహదేవప్పది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ చేసిన హత్యగా బండి సంజయ్ అభివర్ణించారు. ఓటమి భయంతో బెదిరింపులకు, అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరోవైపు మహదేవప్ప ఆత్మహత్య ఘటనకు నిరసనగా డీజీపీ కార్యాలయం ముందు బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ ఆఫీసు ముందు పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.

