Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

‘దళం’ ఫోన్ చేసి ఒస్తదా ఏంది!?

‘‘కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడెంలోని ఓ ప్రయివేట్ స్కూల్లో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చినపుడు నా ఫోన్ కి.. మధ్యప్రదేశ్ లోని ఒక నెంబర్ నుండి కాల్ చేస్తున్నమని చెప్పి.. పీపుల్స్ వార్ మావోయిస్టుల నాయకుల పేరిట మాట్లాడుతూ.. ఇప్పుడే మవోయిస్టు పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈరోజు అర్థరాత్రి 12 గంటల్లోపల రఘునందర్ రావు అనే మెదక్ ఎంపీని చంపేస్తామని, ఆయనను హెచ్చరిస్తున్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదికపై ఉండడంతో నా పీఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నపుడు మళ్లీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈరోజే అర్థరాత్రి 12 గంటలకు డెడ్ లైన్ అని చెప్పి, జాగ్రత్తగా ఉండమను, మేం వస్తా ఉన్నం, బయలుదేరినం.. అని చెప్పి మళ్లీ అదే నెంబర్ నుండి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో.. వీటినిబట్టి ఏం అర్థమయితా ఉందంటే..? ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాటలోపల మావోయిస్టు పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా? ఏందా? తెలియదు. ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు.. ఏం జేస్తారనేదాని కోసం మేం ఎవ్వరంగూడ భారతీయ జనతా పార్టీలో పనిజేసేటువంటి నాయకులం, కార్యకర్తలం ఎవరంగూడ ఇట్లాండి భయపట్టించేటువంటి కాల్స్ కు గాని, భయానికిగాని, ఆందోళనకుగానీ గురికాము.., ఏ సంఘటనొచ్చినా, ఏ సందర్భమొచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం.’’ ఇదీ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు నిన్న తనకు వచ్చిన బెదిరింపు కాల్ తర్వాత స్పందించిన తీరు.

తొలుత ఎంపీ రఘునందన్ రావు పీఏకు, రెండోసారి తనకు వచ్చిన ఫోన్ కాల్ పై ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. ఆపరేషన్ కగార్ కు మద్ధతుగా రఘునందన్ రావు పలు సందర్భాల్లో మాట్లాడి ఉండవచ్చుగాక. కేంద్రంలో అధికారంలో గల బీజేపీ పార్టీ ఎంపీగా రఘునందన్ రావుకు అవసరమైన భద్రత ఉంటుంది. ఫోన్ కాల్ నేపథ్యంలో రఘునందన్ రావు భద్రతపై ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్ట చర్యలు తీసుకోవలసిన అవసరం కూడా ఉంది. కానీ రఘునందన్ రావుకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ నక్సల్స్ పనేనా? లేక ఎవరైనా ఆకతాయిల పనా? రఘునందన్ రావు పొడ గిట్టని వ్యక్తులెవరైనా ఇందుకు ఒడిగట్టారా? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి.

మావోయిస్టులు ఏదేని సంచలన ఘటనకు పాల్పడేముందు అటు కేంద్రంలోగావచ్చు, ఇటు రాష్ట్రంలోగావచ్చు.. అధికార పార్టీకి చెందిన నాయకులకు ఫోన్ చేస్తారా? సినీ ఫక్కీలో మేం వస్తున్నాం.. జాగ్రత్తగా ఉండు.. అని ఫోన్ కాల్ ద్వాారా ముందస్తు సమాచారం ఇస్తారా? ఇవీ అసలు ప్రశ్నలు. వాస్తవానికి మావోయిస్టులే కాదు, ఏ గ్రూపు నక్సల్స్ కూడా ‘టార్గెట్’గా ఎంచుకున్న వ్యక్తులపై సంచలన ఘటనకు పాల్పడే సమయంలోగాని, సందర్భంలోగాని వారికే ఫోన్ చేసి, తాము వస్తున్నామని చెప్పిన ఉదంతాలు ఇప్పటి వరకైతే లేవనే చెప్పాలి. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు తాము భావించిన వ్యక్తుల, నాయకుల విషయంలో చర్యకు పాల్పడే ముందు నక్సలైట్లు తమదైన ప్రక్రియను అనుసరిస్తారనేది కూడా విప్లవ కార్యకలాపాల పరిశీలకులకే కాదు, ప్రభుత్వ నిఘా సంస్థలకు, పోలీసు యంత్రాంగానికి తెలియని విషయమేమీ కాదు. ముందుగా హెచ్చరిస్తూ లేఖలు రాస్తారు. ఆతర్వాత పోస్టర్లు లేదా కరపత్రాలు విడుదల చేస్తారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తారు. అయినప్పటికీ మారని వ్యక్తులపై తుపాకీ తూటా చర్య తీసుకున్నట్లు ఘటనానంతరం నేరస్థలిలో ఓ లేఖను వదులుతారు. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా తమ ప్రాబల్య ప్రాంతాల్లో నక్సలైట్లు పాల్పడిన అనేక ఘాతుక చర్యల్లో ఇదే అంశం వెల్లడైంది కూడా. ఇవన్నీ ఒకప్పటి తమ ప్రాబల్య హయాంలో నక్సల్స్ చర్యల తాలూకు దాఖలాలు.

ఈ నేపథ్యంలో ఏదేని సంచలన ఘటనకు పాల్పడే స్థితిలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఉందా? అందులోనూ ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, తెలంగాణాకు వచ్చి ఉనికికోసం సన్సేషన్ చర్యకు పాల్పడే అవకాశాన్నిగాని, శక్తి, యుక్తులనుగానీ మావోలు ఇప్పుడు కలిగి ఉన్నారా? అనే సందేహాలకు సంబంధించిన సమాధానం ఇంటలిజెన్స్ వర్గాలవద్దే సమాధానం ఉండి ఉండాలి. నక్సల్స్ కదలికలపై రెప్పవాల్చని నిఘాను, అప్రమత్తతను కలిగి ఉండే తెలంగాణా పోలీసులు నక్సల్స్ వల్ల రఘునందన్ రావుకు ముప్పు ఉన్నట్లు ఏదేని సమాచారాన్ని కలిగి ఉంటే ఈపాటికి ఆయనను అధికారికంగానే అలర్ట్ చేసి ఉండాలి, అవసరమైన మరింత భద్రతను కూడా పెంచి ఉండాలి.

ఎంపీ రఘునందన్ రావుకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ నెంబర్ ట్రూ కాలర్ లో ‘సైబర్ ఫ్రాడ్’గా చూపిస్తున్న చిత్రం

అయినప్పటికీ బెదిరింపు ఫోన్ కాల్ ను తెలంగాణా పోలీసులు తేలిగ్గా తీసుకోవలసిన అవసరం కూడా లేదు. ప్రతి బెదిరింపుపైనా పోలీసులు తమదైన అప్రమత్తతను కలిగే ఉంటారు. ఒక్కసారి కాదు.. వెయ్యిసార్లు బూటకపు కాల్స్ వచ్చినా, వెయ్యిన్కొక్క కాల్ పైనా అలర్ట్ గానే ఉంటారు. పోలీసు విధుల్లో ఇది ఖచ్చిత విధి. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై ఎంపీ రఘునందన్ రావు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు వచ్చిన ఫోన్ కాల్ ఇంటర్నెట్ నుంచి వచ్చినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన నెంబర్ ను ట్రూ కాలర్ లో పరిశీలించినపుడు ‘సైబర్ ఫ్రాడ్’గా చూపిస్తుండడం గమనార్హం.

మొత్తంగా రఘునందర్ రావు కు బెదిరింపు ఫోన్ కాల్ నిన్న తెలంగాణాలో తీవ్ర కలకలం సృష్టిందనే చెప్పాలి. ఈ సందర్భంగా నక్సలైట్లు పాల్పడిన రెండు, మూడు సంచలన ఘటనలను గుర్తుకు తెచ్చుకోకతప్పదు. ఘట్కేసర్ బ్రిడ్జివద్ద అప్పటి హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిపై, ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావుపై మహదేవపూర్ వద్ద, ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రపై హైదరాబాద్ నగరం నడిబొడ్డున సంచలనాత్మక ఘటనలకు పాల్పడినపుడు అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ నక్సల్స్ ఫోన్ ద్వారా ఏ హెచ్చరికనూ వారికి జారీ చేయలేదు. అలాగని ఇప్పుడు రఘునందన్ రావుకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ ను తేలిగ్గా తీసుకోవడానికీ వీల్లేదు. ఈ అంశాలన్నీ బేసిగ్గా జర్నలిస్ట్ అయినటువంటి ఎంపీ రఘునందన్ రావుకు తెలియనివేమీ కావు.

Popular Articles