జాతీయ స్థాయిలో కులగణనకు ఛాన్స్ లేదా? కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంసిద్దంగా లేదా? కులగణనపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలో అధికారంలో గల బీజేపీకి సవాల్ విసురుతున్న నేపథ్యంలో బీజేపీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ టీచర్ ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటెల రాజేందర్ మంగళవారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కులగణన కాదనలేని సత్యమని, వద్దంటే ఆగేది కాదని, కులాన్ని విస్మరించలేమన్నారు. అయితే రాష్ట్రాల పరంగా కులగణన జరగాలని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులానికి ఒక్కో రిజర్వేషన్ ఉందన్నారు. నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే కమిషన్ వేసి సైంటిఫిక్ గా కులగణన చేయాలన్నారు. తమిళనాడులో చట్టబద్ధ కమిటీ వేసి చేశారని, బీహార్ కూడా అలానే చేశారని ఈటెల గుర్తు చేశారు.
జనాభా పెరుగుతోందన్నది సత్యమని, మరి బీసీ జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నిస్తూ ఇది దుర్మార్గమని వ్యాఖ్యానించారు. అదేవిధంగా 2011 లో 3.61 కోట్లు ఉన్న రాష్ట్ర జనాభా ప్రస్తుతం 4 కోట్లు దాటి ఉంటుందని, నీకు నిజాయితీ లేదు, బ్లఫ్ చేసి మోసం చేసి లెక్కలు ప్రకటించారని సీఎం రేవంత్ ను ఉద్ధేశించి అన్నారు. సీఎం రేవంత్ ప్రతి నిర్ణయం బూమరాంగ్ అవుతుందన్నారు.
‘రాహుల్ గాంధీ తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయమని పార్లమెంట్ లో అంటారు… మరి బీసీల జనాభా 46 శాతం ఉంటుందా ? రేవంత్ రెడ్డికి నిజాయితీ లేదు. మోసం చెయ్యకు అని మరోసారి చెప్తున్న. డ్రామా కంపెనీ కాదు. మాట ఇస్తే తప్పవద్దు. మోడీ గారు ఇస్తే అమలు చేస్తారు.1956 నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 45 ఏళ్లు పైగా పాలించింది కాంగ్రెస్ నే కదా.. ఒక్క బీసీ సీఎం ఎందుకు చేయలేదు? ఎవరు అడ్డం వచ్చారు. ప్రాంతీయ పార్టీలు సోషల్ జస్టిస్ గురించి మాట్లాడలేవు.. కానీ జాతీయ పార్టీలు ఎందుకు చేయలేక పోయాయి?’ అని ఈటెల ప్రశ్నించారు.
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డిని గెలిపించాలని ఈటెల రాజేందర్ కోరారు. కాంగ్రెస్ నిజస్వరూపం తెలిసిందని, ఇది చాలా కీలక సందర్భమని, సరోత్తం రెడ్డి ఒకటో నెంబర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని, టీచర్లకు తాము అండగా ఉంటామని, తమ చరిత్ర టీచర్లకు తెలుసని ఈటెల అన్నారు.
ఈ మీడియా సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, సుభాష్ రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, చాడ శ్రీనివాస్ , అల్లిక అంజయ్య, కార్పొరేటరు దొంగల సత్యనారాయణ, శ్యామ్ రాథోడ్, పీఆర్టీయూ లీడర్ చెన్నకేశవ రెడ్డి, ప్రముఖ డాక్టర్ శీలం పాపారావు, పుల్లారావు యాదవ్, మంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు.