ఫొటోను నిశితంగా గమనించండి.. యూరియా కోసం ‘క్యూ’ లైన్లో నిల్చున్న రైతాంగంంతో మాట్లాడుతున్నది ఖమ్మం పోలీస్ కమిషనర సునీల్ దత్. సాక్షాత్తూ ఓ ఐపీఎస్ అధికారి ప్రాథమిక సహకారం సంఘం (పీఏసీఎస్) ముందు లైన్లో యూరియా కోసం వేచి ఉన్న రైతులతో మాట్లాడుతున్న దృశ్యం కర్షక లోకంలోనే కాదు, పరిశీలకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన ఓ పోలీసు ఉన్నతాధికారి పీఏసీఎస్ ల వద్ద గల రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవడం, రైతులకు యూరియా సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించడం ఆసక్తికర ఘటన మాత్రమే కాదు, రాష్ట్రంలో యూరియా కోసం కర్షకులు పడుతున్న అవస్థలకు సజీవ తార్కాణం.
విపక్ష బీఆర్ఎస్ నాయకులు ఇదే అదునుగా సర్కారు తీరుపై దుమ్మెత్తిపోయడం, గులాబీ పార్టీ పత్రిక పేజీల కొద్దీ వార్తలను తన పాఠకుల ముందుంచడం సంగతి ఎలా ఉన్నప్పటికీ, యూరియా లభించక రైతులు పడుతున్న వేదనకు అసలు దృశ్యం మాత్రం ఇదే. యూరియా కొరతపై కేంద్రంలో అధికారంలో గల బీజేపీ నేతలు, రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పాలకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎరువుల కొరతపై బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు రామచందర్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వాదనలు భిన్నంగా ఉండడం గమనార్హం.

బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఏమంటున్నారంటే.. దేశంలో ఎక్కడా లేని యూరియా కొరత తెలంగాణాలోనే ఎందుకు ఉందని ఆయన ప్రశ్నిస్తున్నారు. బీజీపీ సర్కారును అప్రతిష్టపాలు చేసేందుకు, కాంగ్రెస్ నేతలు అబద్ధాల ప్రచారం సాగిస్తున్నారని అంటున్నారు. కేంద్రం తెలంగాణా కోసం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని, కాంగ్రెస్ నేతలు కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్న బ్లాక్ మార్కెట్ దళారీలకు మద్దతు తెలుపుతున్నారని కూడా ఆరోపించారు. ఈ అంశంలో తాను చర్చకు సిద్ధమని, మంగళవారం ఖమ్మం పర్యటనకు వెడుతున్నానని, అక్కడే చర్చకు తాను సిద్ధమని రామచందర్ రావు సవాల్ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ ను నమ్మొద్దని, ఎరువుల, యూరియా కొరత, రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ పాలనలోనే ఉంటాయని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేస్తే తెలంగాణా రైతుల జీవితాలు ఘోరంగా ఉంటాయని కూడా రామచందర్ రావు వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇదే దశలో ఖమ్మం జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటున్నారంటే..? యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించారు. ఈ అంశంలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శలు సరి కాదన్నారు. తమ శాఖ అధికారులతోపాటు తాను, ముఖ్యమంత్రి గత మార్చి నుంచి ప్రతివారం, పదిహేను రోజులకోసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని, అక్కడి అధికారులను కలిసి యూరియా నిల్వల కోసం అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు. యూరియా విషయంలో కేంద్రం చెబుతున్నదానికి, సరఫరా చేస్తున్నదానికి పొంతన లేదని తుమ్మల అంటున్నారు. రాష్ట్రానికి ఖరీఫ్ సీజన్ లో మొత్తం 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 4.23 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు మాత్రమే ఇచ్చారని, ఇంకా 2.37 లక్షల మొట్రిక్ టన్నుల యూరియా కొరత ఉందన్నారు. ఈ లోటును భర్తీ చేస్తూనే, జూలై నెలకు సంబంధించిన కోటా యూరియా నిల్వలు ఈ నాలుగైదు రోజుల్లో రాష్ట్రానికి పంపించకుంటే ప్రస్తుతం ఉన్న డిమాండును తట్టుకునే అవకాశం లేదన్నారు. ఈ వివరాలను కేంద్ర మంత్రి నడ్డాకు నిన్న కూడా లేఖ రాశానని తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు.

ఇంతకీ వాస్తవ పరిస్థితి ఏమిటంటే..? ప్రస్తుతం రైతులు పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు యూరియాను విరివిగా వాడే సీజన్ ఇది. పత్తికి ప్రతి ఎకరానికి రెండు బస్తాలు, మొక్క జొన్నకు మూడు బస్తాల చొప్పున రైతులకు యూరియా అవసరం ఉంది. వరికి మాత్రం రెండెకరాలకు ఓ బస్తా చొప్పున అవసరం పడుతుంది. వరి నాట్లకు ఇంకా వ్యవధి ఉన్నప్పటికీ, దాదాపు 45 రోజుల వయస్సు గల పత్తి, మొక్క జొన్న పంటలకు మాత్రం అత్యవసరంగా యూరియా వాడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా పత్తికి ప్రస్తుతం 2వ డోస్ యూరియా వాడాల్సిన స్థితి. మొక్క జొన్నకు సైతం 2వ డోసు వాడాల్సి ఉంది. మరో పదిహేను రోజుల తర్వాత చివరి డోసుగా యూరియాను మొక్క జొన్నకు రైతులు వాడుతుంటారు.

ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర పాలకుల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ అర్జంటుగా యూరియాను సరఫరా చేసి రైతును ప్రభుత్వం ఆదుకోవలసి ఉంది. లేనిపక్షంలో కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వేల కోట్ల రూపాయలను రైతు భరోసాగా అందించామనే సంతృప్తి రాష్ట్ర ప్రభుత్వానికి మిగలకపోవచ్చు. ఎందుకంటే.. యూరియా బస్తాలు దొరక్క రైతులు పంటలను నష్టపోతే దాని ప్రభావం ‘స్థానిక’ ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుందనేది కాదనలేని వాస్తవం. ఎరువుల కొరత, యూరియా కొరత, రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ పాలనలోనే ఉంటాయని, ఆ పార్టీని నమ్మి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తే తెలంగాణా రైతుల జీవితాలు ఘోరంగా ఉంటాయని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలను పాలకులు ఓసారి సమీక్షించుకోవలసిన అవసరముందనది నిర్వివాదాంశం.

