Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఎమ్మెల్సీ కవితపై ‘మళ్లీ’ అనుచిత వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మరో ఎమ్మెల్సీ శింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం ఈ తరహా వ్యాఖ్యల పరిణామాల్లోనే మల్లన్నకు చెందిన ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన ఘటన గన్ మెన్ల కాల్పుల వరకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆయా ఘటనను పూర్తిగా మర్చిపోకముందే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై మరోసారి నోరు పారేసుకోవడం గమనార్హం. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ, ‘ఇప్పుడూ కల్వకుంట్ల కవితగారి గురించి మేం పెద్దగా మాట్లాడం, ఎందుకంటే ఆమె మా జాతి కాదు, ఆమెకు సంబంధమే లేదు. వాళ్ల నాయనకోసం చేసుకోమను.. వాళ్ల నాయనకోసం దీక్ష కావచ్చుగాని, మాకోసమేం దీక్ష అంటలేం.. ఆమె 72 గంటలు కాకపోతే, 700 రోజులు చేయమను.. ‘ఆఖరు దినం’దాక.. ఎవడొద్దంటుండు? మాకేం సంబంధం లేదు గదా? కవిత దీక్షతో బీసీలకు సంబంధం లేదండీ.. గామెకు గల్సుడేంది? ‘దొరసాని’కి మేమెందుకు గలుస్తమూ..?’ అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ శింతపండు నవీన్ కు ఇదే మీడియా సమావేశపు వేదికగా చేదు అనుభవం ఎదురైంది. నిరుద్యోగ పట్టభద్రుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన సెగ తగిలింది. పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి, తమ గురించి ఎందుకు మాట్లాడడం లేదని మల్లన్నను నిలదీశారు. డీఎస్సీ అభ్యర్థులు భారీ సంఖ్యలో ప్రెస్ మీట్ వేదిక వద్దకు చేరుకుని తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా నినదించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్సీ అభ్యర్థులకు సమాధానం చెప్పకుండానే తీన్మార్ మల్లన్న అక్కడి నుంచి జారుకున్నారు.

Popular Articles