ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న ఓ ఘటనపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ఓ బిల్ కలెక్టర్ ఉద్యోగం కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలులో ఏ చిన్న పొరపాటు జరిగినా, లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకున్నా, లబ్దిదారునికి ఎటువంటి అన్యాయం జరిగినా సహించేది లేదని మంత్రి పొంగులేటి మొదటి నుంచీ అధికారగణాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఈ అంశాలను భద్రాద్రి జిల్లాకు చెందిన ఓ బిల్ కలెక్టర్ తేలిగ్గా తీసుకున్నట్టున్నాడు. ఆ జిల్లా పంచాయతీ అధికారి కథనం ప్రకారం.. భద్రాచలం పంచాయతీలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న పూస జగదీష్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 12 మంది లబ్ధిదారుల విషయంలో ఘోర తప్పిదానికి పాల్పడ్డాడు. బేస్మెంట్ వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే, పూర్తి చేసినట్లు తప్పుడు సమాచారాన్ని ఆన్లైన్ లో నమోదు చేశాడు. విషయం మంత్రి పొంగులేటి దృష్టికి రావడంతో ఆయన ఆగ్రహించారు. తప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేసిన బిల్ కలెక్టర్ జగదీష్ పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ పంచాయతీ ఈవోను విచారణ జరపాలని ఆదేశించారు.

విచారణ జరిపిన పంచాయతీ ఈవో కలెక్టర్ కు నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత బిల్ కలెక్టర్ జగదీష్ కు పంచాయతీ ఉన్నతాధికారులు మెమో జారీ చేయగా, పొరపాటున ఆయా సమాచారాన్ని అప్లోడ్ అయిందని సంజాయిషీ ఇవ్వడంతో ఆ బిల్ కలెక్టర్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు జిల్లా పంచాయతీ అధికారి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఘటనపై మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో అవకతవకలకు పాల్పడే ఎలాంటి వారినైనా ఉపేక్షించే లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విధుల నిర్వహణలో ఏ విధమైన అలసత్వాన్ని సైతం సహించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

