Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

హైదరాబాద్ లో బీహార్ తుపాకుల పట్టివేత, ఒకరి అరెస్ట్

బీహార్ కు చెందిన తుపాకుల విక్రయ ముఠాకు చెందిన కీలక వ్యక్తిని రాచకొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. చెర్లపల్లి పోలీసులు, మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో అంతర్ రాష్ట్ర ఆయుధ విక్రయ ముఠా నాయకుడు పట్టుబడ్డారు. ఈ ఘటనలో బీహార్ కు చెందిన శివకుమార్ (32) అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు మీడియాకు వివరించారు. ఈ ముఠాలో మరో సభ్యుడైన బీహార్ కే చెందిన కృష్ణ పాశ్వాన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. అరెస్ట్ చేసిన నిందితుని నుంచి మూడు దేశవాలీ తుపాకులను, 10 తూటాలను, ఓ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

బీహార్ కు చెందిన శివకుమార్ హైదరాబాద్ లోని మేడిపల్లిలో గల ఓ ఎరువుల కంపెనీలో హమాలీగా పనిచేస్తూ ఆయుధాలు తయారు చేసి, హైదరాబాద్ లో విక్రయించి సులభంగా డబ్బు సంపాదించడానికి పథక రచన చేశాడన్నారు. తనబావమరిది కృష్ణ పాశ్వాన్ తో కలిసి శివకుమార్ ఆయుధాల విక్రయానికి పథక రచన చేశాడని, ఇతను గతంలో నేర చరిత్రను కలిగి ఉన్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. ఇటీవల రాఖీ పండుగకు బీహార్ వెళ్లిన శివకుమార్ అక్కడి నుంచి ఆయుధాలను తీసుకువచ్చి అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు అరెస్ట్ చేశామన్నారు. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండడం తీవ్ర నేరమని, ఇటువంటి వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సుధీర్ బాబు ఈ సందర్భంగా కోరారు.

Popular Articles