చర్ల: తెలంగాణా-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో నలుగురైదుగురు మావోయిస్టులు మరణించినట్లు ధ్రువపడని సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నక్సల్స్ ఏరివేతలో భాగంగా ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ పేరుతో నిర్వహిస్తున్న కూంబింగ్ ఇరువర్గాల మధ్య భారీ కాల్పులకు దారి తీసినట్లు తెలుస్తోంది.
మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు దేవ్ జీ, పాపారావు, బడే దామోదర్ తదితరులు టార్గెట్ గా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున కర్రెగుట్టల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నక్సల్స్ తో కాల్పులు జరుతున్న మాట వాస్తవమేనని, అయితే ఫలితం ఏమిటనే అంశంపై సమాచారం అందాల్సి ఉందని విశ్వసనీయ పోలీసు వర్గాలు చెప్పాయి.

బస్తర్ ఐజీ ప్రకటన సారాంశం:
కాగా కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ వార్తలపై బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ ఓ ప్రకటన విడుదల చేశారు. బస్తర్ ప్రాంత శాంతిభద్రతల పరిరక్షణకు ఇక్కడి పోలీసులు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్ గఢ్ సర్కార్ లు నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలను ప్రభావవంతంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. నక్సల్స్ నిర్మూలన కార్యకలాపాల్లో నిమగ్నమైన దళాల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆపరేషన్ పూర్తయ్యే ముందు వివరాలను వెల్లడించలేమన్నారు. తమ వ్యవస్థ, కార్యకలాపాలకు సంబంధించిన ముఖ్యమైన పరిణామాల సమాచారాన్ని తగిన సమయంలో అధికారికంగా వెల్లడిస్తామని, సంబంధిత అధికారులు జారీ చేసిన అధికారిక సమాచారం కోసం వేచి ఉండాలని ఐజీ సుందర్ రాజ్ కోరారు.

