Top 5 This Week

Related Posts

‘ప్రజావాణి’పై భద్రాద్రి జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం

కొత్తగూడెం: ప్రజలు తమ సమస్యలను నివేదించేందుకు నిర్దేశించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చేవారి వెసులుబాటు కోసం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇందులో భాగంగానే ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించున్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రకటించారు. జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుండి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కేంద్రానికి వస్తున్నట్లు చెప్పారు. అందువల్ల వీరి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు భూసమస్యల పరిష్కారం కోసం అక్కడే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తారన్నారు. అదేవిధంగా కొత్తగూడెం డివిజన్ పరిధిలోని ప్రజల భూ సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తారని చెప్పారు. అయితే ఇతర సమస్యలపై దరఖాస్తు చేసుకునేవారు మాత్రం జిల్లా కలెక్టరేట్ లోని ఇన్వార్డ్ సెక్షన్ లో తమ దరఖాస్తులను అందజేసి రశీదు పొందాలని, దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.

Popular Articles