ఆయన మంత్రిత్వ శాఖల్లో సమాచార శాఖ ఉంది కాబట్టి సరిపోయింది.. లేని పక్షంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మీడియా కథనాలు ఈరోజు పతాక శీర్షికకు మారేవేమో..! మంత్రి ‘పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం’ అంటూ నిన్నటి నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు చెందిన కొన్ని పత్రికలతోపాటు ఇతరత్రా చిన్నా, చితకా వార్తా సంస్థలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. గులాబీ పార్టీ పత్రికైతే ఇంకో అడుగు ముందుకేసి ‘పొంగులేటికి తలంటు!’ శీర్షికన భారీ వార్తా కథనాన్నే తన పాఠకులకు అందించింది. అంతేకాదు..సీఎం సూచనలతోనే పీసీసీ చీఫ్ మంత్రిపై విరుచుకుపడ్డారని ఉప శీర్షికలో పేర్కొంది కూడా..
ఇంతకీ పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఇంతలా ఆగ్రహించడానికి గల నేపథ్యంలోకి వెడితే.. ‘ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని, రేపటి (సోమవారం) కేబినెట్ సమావేశంలో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని, తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు.. జరుతాయనే సారాంశంతో పొంగులేటి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోకజకవర్గంలో ఆదివారంనాటి పర్యటనలో పేర్కొన్నారు. పనిలో పనిగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా ప్రభుత్వానికి ప్రజల మద్ధతు కూడగట్టాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేనని కూడా పొంగులేటి పేర్కొన్నారు.

ప్రభుత్వంలో నెంబర్ 2గా ప్రాచుర్యంలో గల పొంగులేటి వ్యాఖ్యలకు సహజంగానే మీడియా ప్రాధాన్యతనిస్తూ కవరేజీ ఇచ్చింది. సమాచార శాఖ మంత్రి కావడం వల్ల కూడా ప్రభుత్వ ‘ప్రకటనల’ అవసరాన్ని గుర్తెరిగి మరికొన్ని మీడియా సంస్థలు అవసరానికి మించి కూడా ప్రాధాన్యతనిచ్చాయని చెప్పక తప్పదు. అవసరానికి మించి.. అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందంటే ‘స్థానిక’ సంస్థల ఎన్నికల గురించి సంబంధిత శాఖ మంత్రి సీతక్క కూడా పొంగులేటి ప్రకటనకు ముందే మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సీతక్క మాట్లాడుతూ, తాను అలా అనలేదని నిన్న క్లారిటీ ఇచ్చారనేది వేరే విషయం. కానీ మంత్రి పొంగులేటిపై మాత్రమే పీసీసీ చీఫ్ ఆగ్రహించినట్లు తాజాగా వచ్చిన వార్తలపైనే రాజకీయ చర్చ జరుగుతుండడం విశేషం.
పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు.. పవర్ లో ఉంటేనే పార్టీకి అన్నిరకాలుగా జవసత్వాలు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. ప్రభుత్వం వల్ల పార్టీ నాయకులు పదవులు అనుభవిస్తారు.. ప్రయోజనం పొందుతారు.. నాయకులు, కార్యకర్తలు కష్టపడితేనే పార్టీకి చెందిన ప్రభుత్వం, తద్వారా పవర్ వస్తుంది. అధికారంలో ఉన్న పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గల అవినాభావ సంబంధంపై అనిర్వచనీయ అంశాలు అనేకం. ఇదే దశలో ప్రభుత్వానికి ఓ కెప్టెన్ ఉంటారు. ఆయనే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న నాయకుడు. తన మంత్రివర్గంలోని సభ్యులు ఏదేని అనూహ్య ప్రకటన చేసినా, ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితిని కల్పించినా ఆ సభ్యున్ని మందలించినా, ఆగ్రహించినా, బతిలాడినా, బామాలినా, తలంటినా ఆ పవర్ కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుందనేది రాజకీయ పరిశీలకుల వాదన. సూటిగా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పొంగులేటి చేసిన ప్రకటనపై అభ్యంతరమైనా, ఆగ్రహమైనా వ్యక్తం చేయాల్సింది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే.

ఇదే దశలో పార్టీకి సారథి పీసీసీ అధ్యక్షుడు. పార్టీపరంగా నాయకులకుగాని, కార్యకర్తలకుగాని ఏదేని ఇబ్బంది కలిగించినా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, పోటీ నాయకత్వాలను ప్రోత్సహించినా అవసరాన్ని బట్టి స్పందించాల్సింది పీసీసీ అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వంలో భాగం ఏమాత్రం కాదు. పీసీసీ చీఫ్ సంస్థాగతంగా పార్టీకి సుప్రీమే కావచ్చు.. కానీ కేబినెట్ స్థాయి నాయకుడు ఏమాత్రం కాదనేది పరిశీలకుల వాదన. మరి ఇటువంటి పరిస్థితుల్లో, పరిణామాల్లో కేబినెట్ మంత్రి హోదా గల పొంగులేటిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేయడమేంటి? కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు, రాజకీయ పరిశీలకుల్లో, విశ్లేషకుల్లో తలెత్తుతున్న సందేహమిది. ఇంతలా పీసీసీ చీఫ్ ఓ కేబినెట్ మంత్రిపై ఆగ్రహించినట్లు వార్తలు రావడంపైనే భారీ చర్చ జరుగుతోంది.
పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని కూడా పీసీసీ చీఫ్ పొంగులేటికి హితవు చెప్పినట్లు వార్తల్లోని మరో ముఖ్యాంశం. నిజానికి స్థానిక ఎన్నికల నిర్వహణ అంశం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోనిది. ప్రభుత్వ నిర్ణయాల్లో భాగం కూడా అయితే కావచ్చు. ఈ అంశాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, మంత్రిపై పార్టీ నాయకుడు అగ్రహం వ్యక్తం చేశారనే పాయింట్ ప్రామాణికంగా రాజకీయ చర్చ సాగుతుండడమే అసలు విశేషం. అంతేకాదు మంత్రి స్థాయి నాయకునిపై పీసీసీ చీఫ్ స్పందిస్తూ ఆగ్రహించడం కూడా ఇదేతొలిసారిగా వార్తలు వచ్చాయి. నిజానికి పొంగులేటి చేసిన ప్రకటనపై ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే నియంత్రించాల్సింది ముఖ్యమంత్రి మాత్రమేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ పార్టీ చీఫ్ ఈ అంశంపై స్పందించాల్సి వచ్చినా అంతర్గతంగా మంత్రితో మాట్లాడే అవకాశం కూడా ఉంది. కానీ పీసీసీ చీఫ్ పొంగులేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారనే అంశాన్ని మీడియాకు ఎవరు లీక్ చేశారనే అంశంపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహించినట్లు వచ్చిన వార్తల్లో మరో ముఖ్యాంశం కూడా ఉంది. ఏ మంత్రి అయినా తన మంత్రిత్వ శాఖకు సంబంధించి మాత్రమే మాట్లాడాలని, ఇతర మంత్రులకు సంబంధించిన శాఖలపై మాట్లాడడం తగదని కూడా పీసీసీ చీఫ్ సున్నితంగా హెచ్చరించారనేది తాజా వార్తా కథనాల సారాంశం. స్థానిక సంస్థల మంత్రిత్వ విభాగం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పరిధిలోని అంశం. కానీ ఈ విషయంలో సీతక్క పొంగులేటిపై సీఎంకుగాని, పీసీసీ చీఫ్ కుగాని ఫిర్యాదు చేశారా అంటే..? అబ్బే.. సీతక్కది ఫిర్యాదు చేసే మనస్తత్వం కాదని ఆమె మనస్తత్వం గురించి బాగా తెలిసిన ఇతర పార్టీల నాయకులు సైతం చెబుతున్నారు. మరి ఈ పరిణామాల్లో పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహించడానికి కారకులెరు? ఆయన చేసిన ప్రకటనపై లోలోన ఏదేని ‘రాజకీయం’ జరిగిందా? అనే ప్రశ్నలపైనే భిన్న చర్చ జరుగుతోంది.

వాస్తవానినికి పొంగులేటి తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న పొంగులేటి చాలా సందర్భాల్లో తనదైన శైలిలో స్పందిస్తుంటారనేది అందరికీ తెలిసిందే. ఆయన స్పందించని సందర్భాల్లో మన మీడియా మైక్ పీస్ లు మంత్రి ఎక్కడున్నదీ తెలుసుకుని స్పందించాలని వెంటపడుతాయనేది కూడా బహిరంగమే. ఇదే దశలో పొంగులేటి ఆధిపత్యంపై ఎవరికైనా ఈర్ష్యా, ద్వేషాలు ఉన్నాయా? అనే కోణంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే గత ఎన్నికలకు ముందు పొంగులేటి పోషించిన పాత్రపైనా ఈ సందర్భంగా రాజకీయాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై తిరుగుబాటు చేసి, కల్వకుంట్ల కుటుంబాన్ని ఇంటికి పంపిస్తానంటూ సవాల్ చేసి మరీ పోరాడిన పొంగులేటి ‘దారి’ చూపాకే అనేక మంది లీడర్లు ఆయన మార్గంలో పయనించారనేది వాస్తవిక దృశ్యం. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుతో, అధికారం చేపట్టడంలో పొంగులేటి పాత్ర గురించి కొత్తగా ప్రస్తావించాల్సింది కూడా ఏమీ లేదు. కానీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ నాయకుడు చేసిన ప్రకటన ప్రామాణికంగా ఇలా బాహాటంగా ‘పొగ’ పెట్టడం, ఆయనను పలుచన చేయడం ఎవరికి నష్టమనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా ఉత్పన్నమవుతోంది.
మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పొంగులేటి చేసిన ప్రకటన తప్పా? ఒప్పా? అనే అంశాన్ని పక్కనబెడితే.. తమ పరిధికాని మంత్రిత్వ శాఖల అంశాలపై ఇతర మంత్రులు మాట్లాడరాదని, ఎవరి మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై ఆయా సచివుడే మాట్లాడాలని హితవు చెప్పిన పీసీసీ చీఫ్ తాను ఏరకంగానూ ‘కెప్టెన్’ కాని ఓ కేబినెట్ మంత్రిపై ఆగ్రహించినట్లు వార్తలు రావడమే అసలు కొసమెరుపు.