ఛత్తీస్ గఢ్ అడవుల్లో ఈ ఉదయం నుంచీ కొనసాగుతున్న ఎన్కౌంటర్ ఘటనపై బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ కీలక ప్రకటన విడుదల చేశారు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన సీనియర్ కేడర్ కదలికలపై నిఘా వర్గాల ద్వారా సమాచారం అందినట్లు చెప్పారు. మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్,అలియాస్ సుధాకర్, తెలంగాణా రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావులతోపాటు మరికొందరు సాయుధ మావోయిస్టు కేడర్ ఉన్నట్లు తమకు సమాచారం అందినట్లు ఐజీ పేర్కొన్నారు.
దీంతో నక్సల్స్ ఆపరేషన్ కోసం ఎస్టీఎఫ్, డీఆర్జీ, కోబ్రా భద్రతా బలగాలతో ఉమ్మడి టీంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయా విభాగాలకు చెందిన భద్రతా బలగాలు బీజాపూర్ లోని నేషనల్ పార్క్ ప్రాంతంలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆపరేషన్ లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని ఐజీ పేర్కొన్నారు. నక్సల్స్ కోసం గాలింపు చర్యలు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయని, ఆపరేషన్ ఫలితాలు సరైన సమయంలో అధికారికంగా వెల్లడిస్తామని ఐజీ సుందర్ రాజ్ వివరించారు.



