ఖమ్మం నగరానికి చెందిన మరో వ్యాపారి దివాళా తీశాడు. తనను దివాళాదారునిగా ప్రకటించాలని కోరుతూ ఖమ్మం కోర్టును ఆశ్రయించాడు. కొణిజర్ల మండలం పెద్ద మునగాలకు చెందిన కొదుమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి తొలుత తన గ్రామంలోనే వ్యవసాయం చేసేవాడు. దాదాపు పాతికేళ్ల క్రితం..2000 సంవత్సరంలో ఖమ్మానికి వచ్చి జ్యూస్ పాయింట్ తోపాటు బియ్యం వ్యాపారాన్ని నిర్వహించాడు.
తన వ్యాపార అవసరాలకు పెట్టుబడుల కింద తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అయితే రెండు దశాబ్ధాలపాటు సాగిన తన వ్యాపారం కరోనా కారణంగా సజావుగా సాగలేదని, తనకు రావలసిన డబ్బులు రాకపోవడంతో పెద్ద ఎత్తున నష్టపోయినట్లు పేర్కొంటూ కొదుమూరి శ్రీనివాసరావు ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాళా (ఐపీ) పిటిషన్ దాఖలు చేశారు.
వ్యాపారంలో భారీ నష్టాలవల్ల మొత్తం 64 మంది రుణదాతలకు 2.48 కోట్ల మొత్తం అప్పులు చెల్లించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అందువల్ల తనను దివాళా దారునిగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ తన న్యాయవాది కోనా చంద్రశేఖర్ గుప్తా ద్వారా కొదుమూరి శ్రీనివాసరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.