సత్తుపల్లి: సైబర్ నేరాల దోపిడీ కేసులో ఓ ప్రయివేట్ బ్యాంక్ మేనేజర్ సహా ఆరుగురిని ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 23వ తేదీన సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేయగా, తాజాగా మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. ఉడతనేని వికాస్ చౌదరి, బొప్పన నాగప్రియ, అడపా రామ వెంకటచరణ్ లపై నమోదైన కేసు తదుపరి దర్యాప్తులో భాగంగానే వీరిని అరెస్ట్ చేశామని చెప్పారు.
గురువారం అరెస్ట్ చేసిన నిందితుల్లో చండ్రుగొండలోని కేథలిక్ సిరియన్ బ్యాంక్ (CSB) మేనేజర్ గా 2023లో పనిచేసిన అఖీల్ అబ్ధుల్ తోపాటు ఇస్లావత్ లక్ష్మికళ్యాణ్, భూక్యా తరుణ్, బిల్లా సాయి తరుణ్, సంగెం ప్రవీణ్ కుమార్, వీరంశెట్టి వంశీ ఉన్నట్లు ఆమె చెప్పారు. ఈ కేసు ఇంకా పరిశోధనలో ఉందని, పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.

