Top 5 This Week

Related Posts

ఇదీ ఎమ్మెల్సీ మల్లన్న ఆఫీసుపై దాడి నేపథ్యం

నోరేసుకుని ఏది పడితే అది మాట్లాడితే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పే ఉదంతమిది. సామెతలు, సూక్తులను సరైన పద్ధతిలో సందర్భోచితంగా వాడకుంటే ఎదురయ్యే భయానక పరిస్థితులను, పరిణామాలను చవి చూడక తప్పదని చెప్పే ఘటన ఇది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. మల్లన్నకు రక్షణగా ఉన్న గన్ మెన్లు తుపాకులు తీసి కాల్పులు జరపడం మరింత కలకలానికి దారి తీసిందనే చెప్పాలి. ఇంతకీ మల్లన్న ఏం మాట్లాడాడు? జాగృతి కార్యకర్తలు ఎందుకు దాడి చేశారనే అంశంలోకి వెడితే..

ఇవీ ఎమ్మెల్సీ మల్లన్న కల్వకుంట్ల కవితను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు. నిజానికి మల్లన్న చేసిన ఈ దానేఫ వ్యాఖ్యలను ఏ ఆడబిడ్డ కూడా సహించకపోవచ్చు. చివరికి బీసీ బిడ్డలైనా సరే సమర్థించకపోవచ్చు. అత్యంత నీచమైన ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ ఆమోదించరు. మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడి చేయడానికి ఈ వ్యాఖ్యలే కారణమంటున్నారు. వాస్తవానికి మల్లన్న ఈ విధంగా నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. కులాలవారీగా ప్రస్తావిస్తూ, వ్యక్తులను, నాయకులను ఉటంకిస్తూ దూషించడం మల్లన్నకు పరిపాటిగా మారిందనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అధికార పార్టీలో ఉంటూ కులగణన సర్వే పత్రాలను తన ఛానల్ లైవ్ ప్రోగ్రాంలో తగులబెట్టిన దుస్సాహసం ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యాడు మల్లన్న.

ఇక జానారెడ్డి వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడినే కాదు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినీ దూషించిన వీడియోలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. వరంగల్ నగరానికి చెందిన ఓ వైశ్య న్యాయవాదిని కులం పేరుతో లైవ్ లో దూషించిన సంఘటన కూడా వివాదానికి దారి తీసింది. అంతెందుకు తాజా దాడి ఘటన తర్వాత కూడా మల్లన్న తన నోటిదూల తీరును ఏ మాత్రం మార్చుకోకపోవడం గమనార్హం. తన ఆఫీసుపై జరిగిన దాడి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు శాసనమండలి ఛైర్మెన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు స్పందనగా, ‘ఇగో ఇదే.. మొగన్ని గొట్టి మొగసాలకెక్కిందంటరు సూడు’.. అగో అట్లుంది కత’ అని మల్లన్న వ్యాఖ్యానించడం గమనార్హం. తన ఆఫీసుపై దాడి చేసి హత్యాయత్నం చేసినందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలని తీన్మార్ మల్లన్న ఇదే సందర్భంగా డిమాండ్ చేశారు.

దాడి తర్వాత మీడియాతో మాట్లాడుతున్న మల్లన్న

తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడిని మీడియాపై జరిగిన ఘటనగానే చూడవచ్చా? అనే ప్రశ్నపై ఓ జర్నలిస్టు మిత్రుడు చేసిన వాదన ఈ సందర్భంగా ఆసక్తికరం. ‘ఐ న్యూస్ ఛానల్ ఏర్పాటైన 2008 సంవత్సరంలో తీర్మార్ మల్లన్న ఆరు వేల రూపాయలకు స్క్రోలింగ్ విభాగంలో జూనియర్ గా పనికి చేరాడు. ఆ తర్వాత వీ6 ఛానల్ లో శింతపండు నవీన్ కు గొంగడి కప్పి ‘తీన్మార్’ కార్యక్రమంలో మల్లన్నగా మార్చారు. తదనంతర పరిణామాల్లో ‘తీన్మార్ మల్లన్న’గా ప్రాచుర్యం పొందాడు. ఇతనెప్పుడు జర్నలిస్టు అయ్యాడు? ఏ పత్రికలో వార్తలు కవర్ చేశాడు? మరే ఛానల్ లో రిపోర్టర్ గా పని చేశాడు? అతను చేసింది యాంకర్ గా మాత్రమే. ఆ తర్వాత యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించి, నోరేసుకుని వాళ్లను, వీళ్లను దూషిస్తే జర్నలిస్టు అవుతాడా? అతను నడిపేది మీడియానేనా?’ అని ఆ జర్నలిస్టు ప్రశ్నించం గమనార్హం.

ఇదిలా ఉండగా తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మల్లన్న దారుణంగా మాట్లాడారని, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడేందుకు వస్తే కాల్పులు జరుపుతారా? అని ప్రశ్నించారు. మల్లన్నపై శాసనమండలి చైర్మెన్ కు ఫిర్యాదు చేశానని, జాతీయ మహిళా కమిషన్ ను కూడా కలుస్తానని చెప్పారు. మల్లన్నను అరెస్ట్ చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డిని కూడా అనుమానించాల్సి వస్తుందని కవిత పేర్కొన్నారు.

Popular Articles