టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒక మంచిపని చేశారు. తెలుగుదేశం పార్టీకి వీర విధేయ మహారాజు పూసపాటి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ హోదా కల్పించేలా ప్రతిపాదన చేయడం, వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓకే చేయడం జరిగిపోయింది. ఇవాళ ప్రకటించిన నూతన గవర్నర్ల జాబితాలో అశోక్ గజపతిరాజును గవర్నర్ గా నియమించి గోవాకు కేటాయించారు. ఇప్పటికే తెలుగు నేతలు గవర్నర్లుగా ముగ్గురు వున్నారు. ఇప్పుడు నాలుగో గవర్నర్ అశోక్ గజపతి రాజు. గతంలోనూ మరో ముగ్గురు గవర్నర్లుగా సేవలు అందించారు.
టీడీపీ హయాంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సీనియర్ నేత అశోక్ గజపతిరాజు. ఒకసారి ఎంపీగా కూడా గెలిచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పని చేశారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలో ఉన్న ప్రతీసారి మంత్రివర్గంలో ఆయన పేరు ఖాయంగా ఉండేది.


పూసపాటి రాజ వంశానికి చెందిన అశోక్ గజపతి రాజు విజయనగరం ఎస్టేట్ కు అధిపతి. సూర్య వంశపు ఉదయపూర్ మహారాజా వారసులు. వీరి తండ్రి విజయనగరం రాజా సాహెబ్ విజయరామ గజపతి రాజు పార్లమెంట్ సభ్యునిగా పని చేశారు. అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి ప్రస్తుతం విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్నారు. ఎన్నో భూములను పేదలకు దానం చేసిన వంశం. ఎంతో సింప్లిసిటీ జీవితం. వయోభారం వల్ల ఇప్పుడు ఏమిటన్నది తెలియదుగాని, గతంలో తన కారు కూడా తనే తుడుచుకుని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే అరుదైన విలక్షణ వ్యక్తిత్వం అశోక గజపతి రాజుది. అంతేకాదు సరిగ్గా ఏడాదిన్నర క్రితం.. 2004 జనవరిలో హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో సామాన్యుడిలా కూర్చుని తాను ఎక్కవలసిన రైలు కోసం ఎదురుచూస్తున్న ఈ రాజవంశీకుని ఫొటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ హోదా లభించడం స్ఫూర్తిదాయకం. అభినందనలు అశోక్ గజపతి గారూ…
– డా. మహ్మద్ రఫీ