Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

మార్చండి మైండ్ సెట్!

రైజింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడటం ఇది రెండోసారి. గతంలో ఓసారి మాట్లాడితే కొంచెం అతికినట్లు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ అదే మాట్లాడితే దివాళా తీసినట్లు, చేతులెత్తేసినట్లు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. కుటుంబ పెద్ద ఇలా మాట్లాడితే కుటుంబ సభ్యులు ఏమైపోతారు? డబ్బులు వున్నా లేకున్నా ఆ ఇంటిని గుట్టుగా గంభీరంగా నడిపించాలి, నడిపిస్తుంటారు.. ఇది లోక సహజం. లేదంటే కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోతారు. ముఖ్యమంత్రి అయినా అంతే.. రాష్ట్రానికి పెద్ద దిక్కు. నన్ను కోసినా ఏం చేయలేని పరిస్థితి అని మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు? చేతకాని ప్రభుత్వం అనుకుంటారు.

ప్రతిపక్షాల ఉచ్చులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు తానే వెళ్లి ఇరుక్కుంటున్నారా అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అనుభవలేమి అనడాన్ని నేను ఒప్పుకోను. రాజకీయాల్లో వున్న వారందరికీ అనుభవం ఉంటుందో, లేదో చెప్పలేం. కానీ పదవిలో వున్నా, లేకున్నా ఒక లక్ష్యం అంటూ ముందుకు సాగిన వారికి అనుభవంతో పని లేదు! జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ చీఫ్ లాంటి పదవులు చేసి ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇంతకన్నా అనుభవం ఏం కావాలి? ఆ మాటకొస్తే కీసీఆర్ కు ఏం అనుభవం ఉంది? మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా చేసినా, ఆయన తెలంగాణ ఉద్యమంలోనే ఎక్కువ కాలం గడిపారు. ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్ల పాటు తనదైన శైలిలో నడిపించారు. ఆయనకు అంతకు ముందు ముఖ్యమంత్రి పదవీ అనుభవం ఏమి లేదుగా!

ప్రతి అంశంపై ముఖ్యమంత్రికి పట్టు ఉండాలి. లేకున్నా సంబంధిత అధికారులు లేదా సీనియర్ రాజకీయ దిగ్గజాల సూచనలు, పరిశీలన, పరిశోధనల ద్వారా అనుభవం చేకూరుతుంది. అది నిరంతర ప్రక్రియ. అదొక మహా సముద్రం. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన ప్రతి ఒక్కరూ అంతకు ముందు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం వున్న వారేం కాదు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు మినహాయిస్తే. అందుకే రేవంత్ రెడ్డికి అనుభవం లేదనే విమర్శను నేను అంగీకరించను.

రాష్ట్రం, దేశం పగ్గాలు పట్టి నడిపించడం కత్తి మీద సాములాంటిదే. అనేక ఒత్తిళ్ల మధ్య రాజకీయంగా సామరస్యంగా సానుకూలంగా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతుండాలి. వారి వారి రాజకీయ నాయకత్వ ప్రతిభను బట్టి ఎన్నేళ్లు లైమ్ లైట్లో అత్యంత ప్రాధాన్యంలో ఉండగలుగుతారో ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి రాజకీయం వేరు. అంతా ఖుల్లం ఖుల్లా. దాపరికాలు ఏమి ఉండవు. సలహాదారులు వున్నారు కానీ, వారి సలహాలు తీసుకున్న దాఖలా కూడా లేదు. అసలే కాంగ్రెస్ పార్టీ.. అదొక మహా సముద్రం. రాజుతో పాటు సామంత రాజులు ఉంటారు. జాతీయ పాత పార్టీ కాబట్టి స్వేచ్ఛ కూడా ఎక్కువే. మరో జాతీయ పార్టీ బీజేపీలో ఆ స్వేచ్ఛ కనిపించదు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికి తోచింది వారికి అనిపించింది వాళ్ళు మాట్లాడేస్తుంటారు. రేవంత్ రెడ్డి తన నాయకత్వ పటిమతో అందరినీ కలుపుకుపోతూ ఎవరి స్వేచ్ఛ వారికి ఇస్తూ నడిపిస్తున్నారు. అది రేవంత్ రెడ్డి ప్రతిభా సామర్ధ్యం. తిమింగళాల మధ్య ఈత కొట్టడం అంత వీజీ కాదు.

ఏ ప్రభుత్వం వున్నా సుపరిపాలన అందించాలని, తిరిగి పరిపాలనలోకి రావాలని పట్టుదలతో ఉండటం సహజం. ఏ ప్రభుత్వానికి అయినా నిధుల లేమి సహజమే. ప్రభుత్వంలో డబ్బులు ఉంటే మా ఉప్పల బాలు అయినా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు. నిజానికి ఏ ప్రభుత్వం అయినా మంచి చేసి, మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వ ఖజానాఖాళీ చేసి, పైగా అప్పులు తెచ్చి మరీ అనేక పథకాలు ప్రవేశపెట్టి మాయ చేసి మరీ గంభీరంగా ప్రభుత్వాన్ని నడిపిస్తుంటారు. కేవలం మంచితనంతో పెద్దగా చదువులేని అంజయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఖజానా ఖాళీ అని చెప్పలేదు.

గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి పొడవడానికి ఖజానా ఖాళీ చేసిన విషయాన్ని, తెచ్చిన అప్పులను చూపించడానికి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో చెప్పొచ్చు. ఆ సమయం అయిపోయింది. ప్రభుత్వంలోకి రాగానే చెప్పేశారు. ఆ ప్రభుత్వం బాగా చేయలేదనేగా ప్రజలు ఓటు అనే ఆయుధంతో నరికేసి మీకు పట్టం కట్టింది? ఇంకా అదే డప్పు కొడితే ఎలా?

హామీలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చినట్లే, ప్రభుత్వంలో సొమ్ములు లేవనే విషయం కూడా తెలిసే ఉంటుంది. అయినా ఖజానాతో ప్రజలకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు పనేం ఉంది? ప్రభుత్వంలో ఇబ్బందులు లేకుండా, ప్రజలను ఆకట్టుకునేలా పరిపాలించడమే నాయకుడి లక్షణం. లోటు పాట్లు చెప్పినా ప్రయోజనం ఉండదు. అలా చెప్పుకుంటే పరువు పోతుంది మినహా సానుభూతి ఏమి ఉండదు. పక్క రాష్ట్రంలోనూ డబ్బు లేదు. ఆయన అనుభవంతో ఆపసోపాలు పడుతున్నారు. మీరు కూడా అంతే. అదే దారిలో కష్టపడాలి. చేతులెత్తేస్తే నాయకత్వానికి అది ఓటమి అవుతుంది. గుంభనంగా పరిపాలన చేయాలి. ఎన్ని విధాలుగా విస్తరించాలో చూడాలి. ప్రజల ముందు గుట్టు విప్పితే ఎవ్వరూ క్షమించరు. ఓటమి ఒప్పుకున్నట్లే అవుతుంది.

సీఎం రేవంత్ రెడ్డి

ఇంకా ఏమీ మించిపోలేదు. ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. కేసీఆర్ పట్ల ప్రేమ ఇంకా ఏం పెరగడంలేదు. మైండ్ సెట్ మార్చండి. అరిస్టాటిల్ చెప్పినట్లు ఆలోచనలు విస్తరించండి. అనుభవం వున్న వారితో అడుగులు వేయండి. ఒక్క అడుగు వెనక్కి వేసి పది అడుగులు ముందుకు వేయవచ్చు. ముందు ప్రభుత్వంలో కీలక ఉద్యోగులను ప్రక్షాళన చేయండి. గత పదేళ్ల లో ఆ ప్రభుత్వంలో వున్న కీలక అధికారులను మార్చండి. అప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉన్నట్లు అవుతుంది. ఇప్పుడు మీరు అధికారంలో వున్నా, అధికారులు మాత్రం ఇంకా కేసీఆర్ గుప్పెట్లోనే ఉన్నారు.

ఆర్టీసీ సమస్యలు ఇప్పుడు మీ హయాంలో ఏర్పడినవేం కావు. ఎన్నో దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్యలే. సమ్మె చేసి భయపెట్టి సమస్యలు పరిష్కరించుకోవడం ఉద్యోగులకు ముందు నుంచి ప్రభుత్వాలు నేర్పించిన విద్య. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు సైరన్ మోగించారు. వాళ్ళు వీళ్ళు చర్చలు కాదు. మీరే పిలిచి హామీలు ఇస్తే సమ్మె ఉండదు ఏమి ఉండదు. అలా రాజకీయంగా అడుగులు వేయాలి కానీ, నేను పారదర్శకం అంటూ మొత్తం గుట్టు విప్పితే అసమర్ధుడిగా జనం ముద్ర వేస్తారు. ఉన్నది ఉన్నట్లు చెబితే సమాజం కిరీటం పెట్టదు. పరిపాలనా దక్షత లేని నాయకుడిగా మిగిలిపోతారు రేవంత్ రెడ్డి గారూ.. మార్చండి మైండ్ సెట్ మార్చండి సార్!

– డా. మహ్మద్ రఫీ

Popular Articles