హైదరాబాద్: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ N Tvకి చెందిన ఇద్దరు జర్నలిస్టులు సహా ముగ్గురు ఉద్యోగులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే వీరిని అరెస్ట్ చేసినట్లు కూడా మరోవైపు ప్రచారం జరుగుతుండడం గమనార్హం. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో N Tv తెలంగాణా ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్, కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ చారి, సెక్రటేరియల్ బీట్ చూసే సుధీర్ అనే రిపోర్టర్ ఉన్నట్లు సమాచారం. తీవ్ర వివాదానికి దారి తీసిన వార్తా కథనాన్ని చదివిన మహిళా యాంకర్ తోపాటు, స్క్రిప్టును దిద్దిన సబ్ ఎడిటర్ పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఓ మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వార్తా కథనాన్ని ప్రసారం చేసినట్లు అభియోగాన్ని ఎదుర్కుంటున్న N Tv లో అరెస్టుల పర్వం కొనసాగుతోందనే ప్రచారం మీడియా వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు కలిగిస్తోంది. N Tv తెలంగాణా ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ తన కుటుంబంతో కలిసి గత రాత్రి బ్యాంకాక్ వెడుతుండగా, రాత్రి 1.00 గంట ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

