తెలంగాణా పాలనలో సరికొత్త వ్యవస్థ ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ తరపున 10,954 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. విలేజ్ లెవెల్ ఆఫీసర్లు (VLO) పేరుతో క్రియేట్ చేసిన ఈ ఉద్యోగాల భర్తీతో గ్రామ పరిపాలనను బలోపేతం చేయనున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వులో స్పష్టం చేసింది. అయితే వ్యవహారికంలో మాత్రం ఈ పోస్టుల్లో నియమితులయ్యేవారిని గ్రామ పాలనా అధికారులు (GPO)లుగా సంబోధించనున్నారు. ఇంతకీ వీళ్లేం చేస్తారు? నిత్యం వీళ్ల విధులేమిటి? అనే ప్రశ్నలు సహజంగానే ఉద్భవిస్తున్నాయి.
మంజూరైన మొత్తం 10,954 పోస్టుల్లో గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా వ్యవహరించినవారినీ తీసుకోనున్నారు. ఆప్షన్ల ద్వారా వీరిని ఈ పోస్టుల్లో నియమించనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రద్దయిన వ్యవస్థలోని వీఆర్వో, వీఆర్ఏలను కూడా జీపీవోలుగా నియమించనున్నారు. ఆసక్తి గల మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలను రాత పరీక్షల ద్వారా మాత్రమే జీపీవోలుగా నియమించే అవకాశముంది. మంజూరైన మొత్తం పోస్టుల్లో మొత్తం కొత్తవారినే నియమిస్తే ప్రభుత్వం ఖజానాపై భారం పడే పరిణామాల్లో మాజీ వీఆర్వో, వీఆర్ఏలవైపు సర్కారు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జీపీవోలుగా నియమితులైన వారు భూహక్కులు, ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక, భూముల సర్వేల్లో సహకరించడం, విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన ఎంక్వయిరీల, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కుదర్చడం వంటి కీలక బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా వ్యవహరించేంందుకు వీరి నియామకం జరుగుతోంది.
ఓరకంగా చెప్పాలంటే వైఎస్ జగన్ హయాంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వలంటీర్ల వ్యవస్థ తరహాగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వ తరహా వలంటీర్ల నియామకం కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాల్లోనే ఇటువంటి వ్యవస్థను తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇది ఏమేరకు ప్రభుత్వ లక్ష్యాన్ని, ఆశయాన్ని నెరవేరుస్తుందనేది మున్ముందు చూడాల్సిందే. ఎందుకంటే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం జీపీవోల నియామకం ద్వారా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తుండడం గమనార్హం.