హైదరాబాద్: తెలంగాణాలో లిక్కర్ షాపులకు దరఖాస్తులు స్వీకరించేందుకు రంగం సిద్ధమైంది. ఇదులో భాగంగా లిక్కర్ షాపుల కేటాయింపునకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన లాటరీ ప్రాతిపదికన లిక్కర్ షాపులను కేటాయించనున్నారు. వచ్చే రెండేళ్ల కాలానికి.. అంటే 2025 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులను ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈసారి లిక్కర్ షాపుల దరఖాస్తు ఫీజును రూ. 3.00 లక్షలుగా నిర్ణయించారు. సామాజిక వర్గాల వారీగా గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం చొప్పున రిజర్వేషన్ల ప్రకారం షాపులను కేటాయించనున్నారు.


