శంషాబాద్ సమీపంలో గల ఓ ఫాం హౌజ్ లో రూ. 11.00 కోట్ల నగదు నిల్వలు గల అట్ట పెట్టెలను ఆంద్రప్రదేశ్ కు చెందిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ నగదు మొత్తం ఏపీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిందిగా వార్తలు వస్తున్నాయి. ఏపీ లిక్కర్ స్కాం కేసులో 40వ నిందితునిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏపీ సిట్ అధికారులు బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకుని దాడులు నిర్వహించారు. శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫాం హౌజ్ లో ఈ నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నిత్య వార్తల్లో ఉంటున్న లిక్కర్ స్కాం కేసులో A1 గా ఉన్న కశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాలు మేరకు వరుణ్ పురుషోత్తం, చాణక్య అనే వ్యక్తులు వినయ్ అనే మరో వ్యక్తి సాయంతో 12 అట్ట పెట్టెల్లో రూ. 11.00 కోట్ల నగదు కట్టలను దాచినట్టు అంగీకరించినట్లు తెలుస్తోంది. నిరుడు జూన్ నెలలో ఈ నగదు నిల్వలను ఇక్కడ దాచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ స్కాంలో రూ. 3,500 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించినట్లు వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శంషాబాద్ సమీపంలోని ఫాం హౌజ్ లో పట్టుబడిన రూ. 11.00 కోట్ల నగదు నిల్వలు లిక్కర్ స్కాంలో మరెన్ని మలుపులకు దారి తీస్తుందనే అంశంపై ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను కలిగిస్తోంది.

