Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

…తెలుస్తలేదుగానీ, జనాగ్రహ ‘బుల్లెట్’ రెడీ..!

కాంగ్రెసోళ్ల ఇజ్జత్ ఎవ్వరూ తియ్యాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాళ్లే సెల్ఫ్ గోల్ చేసుకుంటరు. ఇందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అనేకసార్లు రుజువైన అంశం కూడా. తాజాగా మరోసారి తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా పరువు తీసుకుందని నెటిజన్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలే చెబుతున్నాయి. ఇంతకీ విషయమేమిటంటే..

‘తెలంగాణా కాంగ్రెస్’ అధికారిక X ఖాతాలో ఓ ట్వీట్ చేసి, పోస్టును పిన్ కూడా చేసింది. ట్వీట్ లో తెలంగాణా కాంగ్రెస్ కోరిందేమిటంటే..? ‘తెలంగాణా రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నారు? ఫాం హౌజ్ పాలనా? ప్రజల వద్దకు పాలనా? అనే ప్రశ్నలతో పోల్ ట్వీట్ చేసింది. ఫాం హౌజ్ పాలనకు 73.5 శాతం, ప్రజల వద్దకు పాలనకు 26.5 శాతం నెటిజన్లు తమ స్పందనను తెలియజేశారు. ప్రస్తుతానికి ఈ ట్వీట్ మాయమైందనేది వేరే విషయం.

సోషల్ మీడియాను హ్యాండిల్ చేయడంలో కింగ్ గా పేరు గాంచిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారియర్లు కాంగ్రెస్ పోల్ ను హైజాక్ చేశారనేది కొందరి వాదన. కాంగ్రెసోళ్లకు తెలివి లేదనేది మరికొందరు వెక్కిరింపు ధోరణి. ఇటువంటి హైజాక్ దందాల్లో కాంగ్రెస్ మీడియా, సోషల్ మీడియా విభాగాలకు చేవ లేదని తేల్చేస్తూ, తమలాంటి వారికి అప్పగిస్తే ఏదో పొడిచేస్తామనే తీరుతో డొల్ల విశ్లేషణలు. బీఆర్ఎస్ అధికారిక పత్రికలో తాము కీలక స్థానంలో వెలగబెట్టిన ఘనకార్యానికి ఆ పార్టీ ఇజ్జత్ పోయిన ఫలితంగా ఇటువంటి విశ్లేషకుల ఉద్యోగమే ఊడిందనేది చాలా మందికి తెలియదు. సరే తామేదో కాంగ్రెస్ పార్టీని రక్షించగలమనే పరోక్ష సంకేతాలిస్తూ, తమకు ఉపాధి చూపాలనే కాంక్ష తప్ప ఈ లోపభూయిష్ట విశ్లేషణల్లో మరేమీ కనిపించడం లేదు.

నిజానికి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనపై తీవ్ర వ్యతిరేకతతో, ఎన్నో ఆశలతో తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారనేది అందరికీ తెలిసిందే. కానీ గడచిన 13 నెలల కాలంలోనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత భారీగానే వచ్చిందనేది కాదనలేని వాస్తవం. ఇందుకు కారణాలు అనేకం ఉండవచ్చు. డొల్ల ఖజానా, పాలకుల వైఫల్య పోకడలు, పాలనలో సమన్వయలోపం, అధికార యంత్రాంగంపై ఇప్పటికీ పట్టు సాధించకపోవడం.. వంటి అనేక అంశాలు ఇందులో దాగి ఉన్నాయి. ఆయా విషయాలను లోతుగా విశ్లేషిస్తే చేంతాడంత అవుతుంది.

సీఎం రేవంత్ రెడ్డి

ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సర్వేలో కొందరు ఎమ్మెల్యేలపై, మరికొందరు మంత్రులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ సర్వేలో నిజానిజాల సంగతి దేవుడెరుగు. కానీ రుణమాఫీ, రైతు భరోసా తదితర ముఖ్యాంశాల్లో ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతాంగ కుటుంబాల ప్రజలు ప్రభుత్వ తీరును తీవ్రంగానే విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సర్కార్ అలవాటు చేసిన ఉచిత సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు ఆశలు వదులుకోలేదు. రైతు భరోసాగా పేరు మార్చిన రైతు బంధు పథకం ఈ కోవలోకే వస్తుంది. అన్నం మొత్తం చూడాల్సిన అవసరం లేదు.. మెతుకు ముట్టుకుంటే అన్నం ఉడికిందో, లేదో చెప్పవచ్చు.. అనే సామెతతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితులను పరికిస్తే రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయానికి హెచ్చరిక లాంటి సంకేతంగా పేర్కొనవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జిల్లాకు చెందిన ఓ సచివుని నియోజకవర్గంలో పరిస్థితి అత్యంత ఘోరంగా ఉన్నట్లు ప్రభుత్వ నిఘా వర్గాలే చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ నాయకునికి చరిత్రాత్మక విజయాన్ని అందించిన సదరు నియోజకవర్గ ప్రజలు అంచనా వేయలేని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో ఓటమి చెందిన ప్రత్యర్థి పార్టీ నాయకుడు ‘రెండు పెగ్గులు’ మద్యం సేవించి ఇంట్లో శయనించినా గెలుస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కాదని, కేవలం అతని వ్యక్తిగత ఇమేజ్ మాత్రమేనంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరికొందరు ఎమ్మెల్యేల పనితీరుపైనా ప్రజల్లో వ్యతిరేకత క్లియర్ గానే కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుందనే సంకేతాల తరహాలోనే ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యతిరేకత ఛాయలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు ఏమిటన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న జన నేతలు ఆత్మపరిశీలన చేసుకోవలసి ఉంది.

2024 జూలై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ సభకు హాజరైన జనంలోని ఓ దృశ్యం (ఫైల్)

ఇదే సందర్భంలో సూటిగా ఓ విషయాన్ని స్పష్టం చేయక తప్పదు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే రాష్ట్రంలో 66 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని 36 ఏళ్ల జర్నలిజపు అనుభవంతో, సేకరించిన సమాచారంతో, పరిమిత నెట్ వర్కుతో చేసిన సర్వే ఫలితాలతో చెప్పిన ‘కలం’తోనే తాజా పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగానే నిష్కర్షగా చెబుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడానికి కారణాలు ఎన్నయినా ఉండవచ్చు… కానీ ఈ పరిస్థితి గులాబీ పార్టీకి అనుకూలంగా మాత్రం లేదనేది కఠోర వాస్తవం. కాంగ్రెస్ పాలకులు తమ పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి మరో మూడున్నరేళ్ల సమయం ఉంది. అప్పటికీ ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోకుంటే పరిస్థితి ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని స్థితి.

-ఎడమ సమ్మిరెడ్డి

Popular Articles