‘‘సమీక్ష’ వెబ్ సైట్ లో ఆ విలేకరి పేరెందుకు రాయలేదు? పోలీసుల, వ్యాపారుల పేర్లు రాస్తారుగాని, విలేకరి పేరును ఎందుకు రాయలేదు? మీ రాతల్లో ద్వంద్వ వైఖరేమిటి? మీ వృత్తిలో గల వ్యక్తిని కాపాడుకుంటున్నారా? లేక ఆ విలేకరికి భయపడుతున్నారా? ’ ఇవీ గడచిన రెండు రోజులుగా పలువురు సంధిస్తున్న ప్రశ్నలు. సోషల్ మీడియా వేదికల్లోనే కాదు, ‘సమీక్ష’ పాఠకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, వివిధ వ్యాపార ప్రముఖులు, కొందరు జర్నలిస్టులు ఫోన్లు చేసి మరీ ప్రశ్నిస్తున్న స్థితి. ఓ జర్నలిస్టు సోదరుడైతే ఏకంగా పోలీసు గ్రూపులోనే ప్రశ్నించాడు. సైబర్ నేరాల కేసుల్లో నిందితుడైన విలేకరి గురించి, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మిర్చి వ్యాపారి గుమస్తాను దోచుకున్న ఘటనలోనూ సమీక్ష ప్రచురించిన వార్తా కథనాల తర్వాత ఇటువంటి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇదే అంశంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలు వచ్చినప్పటికీ, ‘సమీక్ష’ వార్తా కథనాలకు ఎదురైన ప్రశ్నలకు, లభించిన స్పందనకు ధన్యవాదాలు చెప్పక తప్పదు. ఇదే పరిస్థితుల్లో వివిధ వర్గాలకు చెందినవారు సంధించిన ప్రశ్నలకు బాధ్యతాయుత జర్నలిజంలో భాగంగా స్పందించకా తప్పని స్థితి. అందుకే ఈ అంశంలో చెప్పొచ్చేదేమిటంటే..?
నేరపూరిత ఘటనల్లోగాని, మరే ఇతర ఆరోపణలకు సంబంధించిగాని వ్యక్తుల పేర్లు రాయడానికి జర్నలిజంలో కొన్ని పరిమితులు ఉంటాయి. స్వీయ నియంత్రణ లేకుండా, పరిమితులు పట్టించుకోకుండా, అధికారిక ప్రకటన లేకుండా ఫలానా వ్యక్తికి ఇందులో ప్రమేయముందని, అతనే నిందితుడనో, నేరస్థుడనో నేరుగా రాస్తే ఆ తర్వాత ఎదురయ్యే వివిధ చిక్కులను ఎదుర్కోవలసింది రాసిన జర్నలిస్టే తప్ప, అతని పేరెందుకు రాయలేదని సులభంగా ఓ ప్రశ్నను విసిరే వ్యక్తులు కాదు.సైబర్ నేరాల కేసుల్లో కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసిన ప్రముఖ పత్రిక విలేకరి అంశానికి సంబంధించి ఆ జిల్లా పోలీసు యంత్రాంగం ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. అనేక అంశాల్లో ఆయా జిల్లాల పోలీసు అధికారులు, పోలీస్ పీఆర్వోలు సహజంగా అధికారిక ప్రకటన విడుదల చేస్తుంటారు. కానీ ఖమ్మంలో ప్రముఖ పత్రిక విలేకరిని అరెస్ట్ చేసిన కరీంనగర్ సైబర్ పోలీసులు అధికారికంగా ఎటువంటి పత్రికా ప్రకటన విడుదల చేయలేదు. అయినప్పటికీ ఎఫ్ఐఆర్ కాపీ లభిస్తుందేమోనని చేసిన ప్రయత్నాలు ఎలాగోలా నిన్న ఫలించాయి. అందులో ఏముందనేది చివరలో చెబుతా.

ఇక ఖమ్మం మిర్చి వ్యాపారి గుమస్తాను రూ. 6.00 లక్షలు దోపిడీ చేసిన ఘటనలో విచారణ అనంతరం ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ, సీటీసీ ఏసీపీ రవిని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ వార్తా కథనంలోనూ ప్రముఖ పత్రిక విలేకరి పేరును ‘సమీక్ష’లో ఎందుకు రాయలేదనే రియాక్షన్లు వివిధ మార్గాల్లో చాలా వచ్చాయి. నిజానికి ఈ ఘటనలో బాధితుని ఫిర్యాదు లేకపోయినప్పటికీ, బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలో సీపీ సునీల్ దత్ ప్రత్యేక చొరవ చూపడం గమనార్హం. డబ్బు పోగొట్టుకున్న బాధితుడే ఫిర్యాదు చేయకుంటే, ఆ వ్యాపారికి అండగా నిలిచిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు, ప్రతినిధులు కూడా ఫిర్యాదు చేయకుంటే తాము కేసు ఎలా నమోదు చేస్తామన్నది పోలీసుల ప్రశ్న. కేసే నమోదు చేయనప్పుడు దోపిడీ ఘటనకు స్కెచ్ రూపొందించిన ప్రముఖ పత్రిక విలేకరి పేరును నేరుగా ఎలా రాస్తారనేది జర్నలిజం గురించి తెలిసినవారెవరైనా సమాధానం చెబుతారు.
అసలు ఈ కేసులో విలేకరి పేరు ఎందుకు రాయలేదని ప్రశ్నించడం కాదు.. ఫిర్యాదు ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించాల్సింది ఛాంబర్ ప్రతినిధులను, బాధితుడైన వ్యాపారిని, ప్రత్యక్ష దోపిడీకి గురైన గుమస్తాను. అందువల్ల ఇటువంటి ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం. పోలీసు ఎఫ్ఐఆర్ లభ్యం కానప్పుడు, కేసు నమోదు కానప్పుడు, అధికారిక ప్రకటన లేనప్పుడు నిందితుల పేర్లుగాని, ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తుల పేర్లుగాని రాయడం నైతికతతో కూడిన జర్నలిజం కాదు. అనైతిక జర్నలిజాన్ని చేయడానికి ‘సమీక్ష’ వెబ్ సైట్ నిర్వాహకుడు చేస్తున్నది ట్యూబిజపు జర్నలిజం కాదు, పక్కోడి కంటెంట్ ను తస్కరించి చేస్తున్న కట్ పేస్ట్ జర్నలిజం అంతకన్నా కాదు. ఈనాడు, వార్త, సాక్షి వంటి ప్రముఖ పత్రికల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవంలో నేర్చుకుని చేస్తున్న ‘ప్రొఫెషనల్’ జర్నలిజం మాత్రమే.
ఆ విలేకరి పేరు రాయడానికి భయపడ్డారా? అనే అత్యంత విలువైన ప్రశ్నకు కూడా చెప్పే ఆన్సర్ ఏమిటంటే..? ఏటూరునాగారం అభయారణ్యంలో ఆధిపత్యంలో భాగంగా వేలాది ఎకరాల్లో అడవుల నరికివేతను ప్రోత్సహించిన నక్సల్ గ్రూపుల తీరును ప్రశ్నిస్తూ ‘ఈనాడు’లో వార్తా కథనాలు రాసినందుకు నన్ను మేడారానికి పిలిపించి, ఏకే-47 పక్కన పెట్టుకుని, దాన్ని అటూ ఇటూ కదుపుతూ హుంకరించి టెర్రరైజ్ చేయడానికి ప్రయత్నించిన నక్సల్ దళ నేతకే సరైన సమాధానం చెప్పిన గుండె ఇది. ప్రజాహితాన్ని విస్మరించి ప్రవర్తించిన కొందరు ఐపీఎస్ అధికారులతో పోరాడిన నేపథ్యం ఉంది. తమ అడుగులకు మడుగులొత్తడం లేదని, తమకు గల అధికారంతో అడ్డగోలు కేసులను మోపిన కరడుగట్టిన పొలిటీషియన్లతోనూ తలపడిన హిస్టరీ నా సొంతం. ఈ అంశాల్లో నా గురించి తెలిసినవారికి కొత్తగా చెప్పేదేమీ లేదు.. తెలియనివారికి చెప్పాల్సిన అవసరమూ లేదు.
చివరగా.. ఎలాగోలా ఎఫ్ఐఆర్ సంపాదించిన తర్వాత బాజాప్తాగా చెబుతున్నా.. కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన విలేకరి పేరు తురగా రాజేంద్ర మూర్తి, ఇతను ఆ కేసులో A3. తాను ఆంధ్రజ్యోతి పత్రికలో సీనియర్ జర్నలిస్టుగా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్లు రాజేంద్రమూర్తి తన నేరాంగీకార పత్రంలో పేర్కొన్నట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. ‘గోల్డ్ మైన్స్ అండ్ స్క్రాప్’ పేరుతో ప్రజలను మోసం చేసి, వారి డబ్బులను వ్యక్తిగత వినియోగానికి, జల్సాలకు ఉపయోగించుకున్నట్లు రాజేంద్రమూర్తి నేరాంగీకారంగా పోలీసులు కోర్టుకు నివేదించిన నివేదికల్లో స్పష్టీకరించారు. ఇక ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మిర్చి వ్యాపారి గుమస్తా వెంకన్నను దోచుకున్న విలేకరి ఎవరు? అనే ప్రశ్నకు మాత్రం ఈ పోలీసులు దోపిడీపై ఫిర్యాదు ఎందుకు చేయలేదో, కేసు ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాల్సింది బాధిత వ్యాపారి, అతనికి అండగా నిలిచిన ఛాంబర్ నాయకులు, ప్రతినిధులు మాత్రమే.
–ఎడమ సమ్మిరెడ్డి