ఛత్తీస్ గఢ్: మావోయిస్ట్ పార్టీలో మరో కుదుపు. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ 60 మంది సహచర నక్సలైట్లతో కలిసి నిన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి మావోయిస్ట్ పార్టీ తేరుకోకముందే మరో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ అలియాస్ ఆశన్న సైతం లొంగుబాటలో పయనిస్తున్నట్లు సమాచారం. సుమారు 70 మంది సహచర నక్సలైట్లతో కలిసి ఆశన్న గురువారం ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ముందు లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. జగదల్ పూర్ కేంద్రంగా ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం.
ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని వెంకటాపూర్ మండలం నర్సింగాపూర్ కు చెందిన ఆశన్న 40 ఏళ్ల క్రితం అప్పటి పీపుల్స్ వార్, ప్రస్తుత మావోయిస్ట్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. ప్రాథమిక విద్యాభాసాన్ని లక్ష్మిదేవిపేటలో, కాజీపేటలోని ఫాతిమా స్కూల్ లో సెకండరీ విద్యనభ్యసించారు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్ కు నాయకత్వం వహించారు. ఆ తర్వాత పరిణామాల్లో పాతికేళ్ల వయస్సులోనే అడవిబాట పట్టారు. లొంగుబాటలోకి వస్తున్నట్లు తెలుస్తున్న ఆశన్న వయస్సు ప్రస్తుతం 60 వరకు ఉండవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి రాష్ట్ర హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర హత్యోదంతాల్లో, అలిపిరిలో చంద్రబాబు కాన్వాయ్ ను క్లెమోర్ మైన్లతో పేల్చివేసిన ఘటనల్లో ఆశన్న పేరు ప్రముఖంగా వార్తల్లోకి రావడం గమనార్హం.
ఫొటో: మావోయిస్ట్ నేతలు అభయ్, ఆశన్న