‘విప్లవోద్యమంలో మీకు కలిగిన నష్టాలకు, మీరు భరించిన కష్టాలకు, మీరు చేసిన అసమాన, అనుపమాన త్యాగాలకు మేమే బాధ్యత పడుతున్నాం. మా మిడిమిడి జ్ఞానంతో, వస్తుగత పరిస్థితులను అర్థం చేసుకోవడంలో చేసిన పొరపాట్లకు, మా ఆచరఱలో అవలంభించిన అతివాద ఒంటెత్తువాద తప్పులకు మమ్మల్ని మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సుదీర్ఘ కాలంలో జరిగిన తప్పులకు బాధ్యత పడుతూ ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటున్నాం. మేం తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ చేయడాన్ని అర్థం చేసుకోగలరు. ఈ నిర్ణయం తీసుకోకుండా మిగిలిన విప్లవ శక్తులనైనా కాపాడుకోలేం. మీ త్యాగాలకు, అమరుల బలిదానాలకు న్యాయాన్ని చేకూర్చలేం. ఈ ‘ఓటమి’ బాధాకరమైనదే. కానీ విజయానికి తల్లిలాంటిదనే బలమైన బలమైన విశ్వాసంతో న్యాయమైన ప్రజా సమస్యలపై న్యాయమైన పోరాటాలకు పూనుకుందా.. అపరాధ భావనతో..’ అంటూ మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోను పేరుతో మరో సంచలన లేఖ విడుదలైంది.
అయితే ఈసారి పార్టీ పేరుతో గల ఎర్రని అక్షరాలేవీ లేకుండా, పార్టీ చిహ్నం కూడా లేకుండా ‘విప్లవ ప్రజలకు విజ్ఞప్తి’ శీర్షికన ఆరు పేజీల డీటీపీ లేఖ సోను పేరుతో సోషల్ మీడియా వేదికగా విడుదల కావడం గమనార్హం. సోను అంటే మరెవరో కాదు., ఆయుధాలు వదిలేస్తున్నాం.. అంటూ రెండు రోజుల క్రితం విడుదలైన లేఖలోని పేరు గల అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాలే కావడం గమనార్హం. దశాబ్ధాల విప్లవోద్యమ చరిత్రలో చోటు చేసుకున్న పరిణామాలను, ప్రస్తుత స్థితిగతులను ప్రస్తావిస్తూ సోను పేరుతో విడుదలైన ఆరు పేజీల తాజా లేఖ ఇప్పుడు మరోసారి సంచలన చర్చకు దారి తీస్తోంది. అభయ్ పేరుతో విడుదలైన లేఖ, సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆడియోపైనే భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సోను పేరుతో మరో లేఖ విడుదల కావడం గమనార్హం. గత ఆగస్టు నెలను కోట్ చేస్తూ విడుదలైన ఆ లేఖను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.

