కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి సి. అంజిరెడ్డి విజయం సాధించారు. గత మూడు రోజులుగా సాగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో విజయం చివరికి అంజిరెడ్డినే వరించింది. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఎవరికీ విజయం దక్కకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో మొత్త 53 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు.
బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి 73,644 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అయితే అంజిరెడ్డి గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా ‘బ్యాలెట్’ ఎన్నికల్లోనూ తాము ఘన విజయం సాధించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎన్నిక ఏదైనా ఇక బీజేపీదేనని ఆయన అన్నారు.