Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

పడినా లేవడానికి ఏపీ మనిషి కాదు… రాష్ట్రం!

శివరామకృష్ణన్ గారిని జర్నలిస్టుగా రెండు సార్లు కలిశాను. అపారమైన అనుభవం ఉన్న అధికారి, మేధావి. ఆంధ్రప్రదేశ్ పట్ల పూర్తి అవగాహన ఉంది. రాష్ట్రానికి రాజధానిగా ఆయన సూచించిన ప్రదేశం నూజివీడు దగ్గరలోని ముసునూరు, బాపులపాడు ప్రాంతం. అక్కడ పెద్దమొత్తంలో ప్రభుత్వ భూములు ఉండడం, పెద్దగా సారవంతమైన భూములు కాకపోవడం ఒక కారణం. అన్నిటికీ మించి ఆ ప్రాంతానికి ఒకవైపు ఏలూరు, రెండో వైపు విజయవాడ ఉండడం, ఈ రెండు నగరాలు కొత్త రాజధానిపై వత్తిడి లేకుండా చూసుకునే అవకాశం ఉందని ఆయన నాతో మాట్లాడిన సందర్భంలో చెప్పారు. ఏలూరు, విజయవాడను నూజివీడు మీదుగా రైలు, బస్సు ద్వారా కలిపితే అనువుగా ఉంటుందని ఆయన విశ్లేషణ నాకు బాగా నచ్చింది.

ఉత్తరాంధ్ర నుండి వచ్చే వారు ఏలూరులోనూ, రాయలసీమ ప్రాంతం నుండి వచ్చేవారు విజయవాడలోను బస చేయవచ్చు. గన్నవరం, హనుమాన్ జంక్షన్,నూజివీడును అభివృద్ధి చేస్తే అక్కడ కూడా బస చేయవచ్చు. అంటే రాజధానిపై వత్తిడిని రెండు పెద్ద నగరాలు (ఏలూరు, విజయవాడ), మూడు చిన్న పట్టణాలు (నూజివీడు, గన్నవరం, జంక్షన్) పంచుకుంటాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న విద్యా సంస్థలు కూడా రాజధానికి అనుకూలంగా ఉపయోగపడతాయి. కొత్తగా ఏర్పాటు చేసుకునే రైలు, రోడ్డు మార్గం ఇప్పుడున్న జాతీయ రహదారి రాజధానికి అనువుగా ఉంటాయి. నూజివీడు, తిరువూరు, మధిర మీదుగా హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తే ఆ ప్రయాణం కూడా సులువుగా ఉంటుంది అని ఆయన అభిప్రాయం.

ఇక ప్రకాశం జిల్లా దొనకొండ ఆయన ప్రతిపాదించిన రెండో ప్రదేశం. అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా, ఆ ప్రాంతం isolated గా ఉన్నందువల్ల నగరం అభివృధ్ధి చెందడం కష్టం అని ఆయన అభిప్రాయం.

విజయవాడ-గుంటూరు మధ్య విలువైన పంట భూములు ఉన్నందువల్ల ఆ ప్రాంతం రాజధానిగా సమర్ధించలేం అని చెప్పారు. అయితే విజయవాడ మిగిలిన అన్నినగరాలతో పోల్చినప్పుడు రవాణా, అందుబాటు వంటి విషయాల్లో ముందంజలో ఉన్నా ఈ నగరం చుట్టూ రాజధాని కూడా సమర్ధనీయం కాదని ఆయన అభిప్రాయం.

అయినా రాజకీయ interests ముందు ప్రజల interests ఎవరికి కావాలి? అలా ఒక విజినరీ, మేధావి ముందుచూపు విస్మరించబడింది.

ఇప్పటి ఘర్షణలకు, uncertaintyకి, ఒకరినొకరు ఇప్పుడు నిందించుకొని ప్రయోజనం లేదు. తొలి అడుగే తప్పటడుగు వేశాం. బొక్క బోర్లా పడ్డాం. పడినా లేవడానికి ఆంధ్రప్రదేశ్ మనిషి కాదు, రాష్ట్రం.

-దారా గోపి

Popular Articles